దుబాయ్‌కి వెళ్లాలని భార్యతో గొడవ.. వసంత తండ్రికి ఫోన్‌చేసి..

Married Woman Commits Suicide With Dowry Harassment in Paravada - Sakshi

పరవాడ (పెందుర్తి), విశాఖపట్నం: వరకట్న వేధింపులు తాళలేక వివాహిత పోలారపు వసంత (21) ఆత్మహత్య చేసుకున్న ఘటన వాడచీపురుపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళానికి చెందిన పోలారపు పార్ధసారథి కుటుంబంతో ఏడేళ్ల క్రితం వలస వచ్చి పరవాడ రామాలయం వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఫార్మాసిటీలో లేబర్‌ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. పార్ధసారథికి కొడుకు, కుమార్తె వసంత ఉన్నారు. కుమార్తె వసంత ఇంటర్మీడియట్‌ చదువుకొంది. కళాశాలలో ఆమె చదువుకొంటున్న రోజుల్లో వాడచీపురుపల్లి గ్రామానికి చెందిన పోలవరపు మూర్తి(26)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకొన్నారు. వీరికి రెండేళ్ల గ్రీష్మన, ఏడాది వయసు గల ప్రేమశ్రీ కుమార్తెలు సంతానం.

వసంత భర్త మూర్తి కొంత కాలం వెల్డింగు పనులు చేశాడు. ప్రస్తుతం పని లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. వెల్డింగ్‌ పనిలో అనుభవం ఉన్న మూర్తి దుబాయ్‌లో  పని చేయడానికి వెళ్లేందుకు వారం నుంచి సన్నాహాలు చేసుకొంటున్నాడు. ఈ క్రమంలో దుబాయ్‌ వెళ్లడానికి అవసరమైన డబ్బు కోసం తన భార్య వసంతతో అత్తమామలను రూ.50 వేలు అడిగించాడు. అంత డబ్బు తమ వద్ద లేదని వసంతకు తల్లిదండ్రులు చెప్పేశారు. అయినప్పటికీ డబ్బులు పట్టుకురమ్మని వసంతపై మంగళవారం రాత్రి మూర్తి ఒత్తిడి తేవడంతో మరోసారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి అడిగినా ఫలితం లేకపోయింది.

చదవండి: (మైనర్‌కు మ‌ద్యం తాగించి అఘాయిత్యం... ఆధ్యాత్మిక ‘గురువు’ అరెస్ట్‌)

ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వసంత తల్లిదండ్రులకు మూర్తి ఫోన్‌ చేసి... మీ అమ్మాయికి బాగోలేదని చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చేరుకొన్న తల్లిదండ్రులకు కుమార్తె శవమై కనిపించింది. వెంటనే మృతిరాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు, ఎస్‌ఐ పి.రమేష్, తహసీల్దార్‌ బి.వి.రాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉయ్యాల కోసం ఇంట్లో ఏర్పాటు చేసిన కర్రకు చీరతో మెడకు బిగించుకొని వసంత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సీఐ ఈశ్వరరావు తెలిపారు. 

అనాథలైన చిన్నారులు 
తల్లి మరణం, తండ్రి జైలుపాలు కావడంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు అనాథలుగా  మిగిలిపోయిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. ఊహ తెలియని గ్రీష్మన (2), ప్రేమశ్రీ(1)కి తల్లి మరలిరాదని తెలియక ఆమె కోసం ఆశగా ఎదురుచూస్తుండడం పలువురి హృదయాలను కలచివేసింది. మరోవైపు వరకట్న వేధింపులు భరించలేకే తమ కుమార్తె వసంత ప్రాణాలు తీసుకొందని మృతురాలి తండ్రి పార్ధసారథి ఆరోపించారు. తన కుమార్తె మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. వసంత మృతదేహానికి పరవాడ తహసీల్దార్‌ బి.వి.రాణి సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వసంత భర్త మూర్తి, అతడి తలిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ ఈశ్వరరావు చెప్పారు. పోలవరపు మూర్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top