మైనర్‌కు మ‌ద్యం తాగించి అఘాయిత్యం... ఆధ్యాత్మిక ‘గురువు’ అరెస్ట్‌

Religious Leader Mahant Arrested for Molesting Minor In Madhya Pradesh Rewa - Sakshi

భోపాల్‌: నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. ఇంటా బయటా అన్ని చోట్ల వేధింపులు ఎక్కువవుతూనే ఉన్నాయి.  ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, నిందితులను కఠినంగా శిక్షించినా.. కామాంధుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మహిళలపై లైంగికదాడులు ఆగడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఓ ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ఠ్‌ చేశారు. 

రేవా జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహంతి సీతారాం దాస్‌ అలియాస్ సీతారాం త్రిపాఠి ఓ బాలికను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మార్చి 28న చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే రౌడీ షీటర్‌ సాయంతో.. అధిక భద్రత కలిగి ఉన్న సర్క్యూట్‌ హౌజ్‌ (ప్రభుత్వ భవనం)లో ఈ ఘోరానికి ఒడిగట్టడం గమనార్హం. అనంతరం బాధితురాలిని మహంత్ అనుచరులు కారులో మరో చోటుకి తీసుకెళ్లి వదిలేశారు. అయితే స్థానికుల సహాయంతో ఆమె అక్కడి క్షేమంగా బయటపడింది.
చదవండి: సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో మంచి హోదా.. ఉద్యోగాలు పెట్టిస్తానంటూ..

తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు రేవా జిల్లా పోలీసులకు మార్చి 29న ఫిర్యాదు చేయగా.. సీతారాం త్రిపాఠి, రౌడీ షీటర్‌తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవా పోలీసులను ఆదేశించిన కొన్ని గంటల్లోనే సీతారాం త్రిపాఠిని పోలీసులు సింగ్రౌలీ జిల్లాలో గురువారం అరెస్టు చేశారు.

ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏసీపీ శివ కుమార్ వర్మ తెలిపారు. అయితే ప్రజాప్రతినిధులతో సహా వీఐపీలు బస చేసేందుకు ఉద్దేశించిన సర్క్యూట్ హౌస్‌లో రౌడీ షీటర్ పేరున గదిని ఎలా కేటాయించారనే దానిపై విచారణ జరుగుతోందని ఏసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top