పాత గొడవలు: కత్తులతో పొడిచి దారుణ హత్య

Man Assasianted In Dudbowli At Hyderabad Over Old Clashes - Sakshi

దూద్‌బౌలి: హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శని వారం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌ కుమార్‌ కథనం ప్రకారం... బహదూర్‌పురాకు చెందిన మహ్మద్‌ జూబేర్‌ అలీ (23), తన అన్న మునావర్‌తో కలిసి మెహిదీపట్నంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. జూబేర్‌ అలీ పండ్ల వ్యాపారంపై దృష్టి సారించకుండా చెడు అలవాట్లకు బానిసై శాలిబండ, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో జులాయిగా తిరిగేవాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లోవారికి చెప్పి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు.

ఇదిలా ఉండగా, శనివారం ఉదయం అతడి స్నేహితుడు మునావర్‌కు ఫోన్‌ చేసి మీ తమ్ముడు ఆశా టాకీస్‌ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో చనిపోయి ఉన్నాడని తెలిపాడు. మునావర్‌ పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి వెళ్లాడు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న జూబేర్‌ను చూసి బోరుమన్నాడు.  తన తమ్ముడికి సలాం, తహరీఖ్, ముజఫర్, జాఫర్లతో గతంలో గొడవలు జరిగాయని అతడు తెలిపాడు.

కాగా, తెల్లవారు జామున ఎవరో కత్తులతో పొడిచి, గొంతు కోసి హత్య చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. చార్మినార్‌ ఇన్‌చార్జి ఏసీపీ భిక్షం రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌ కుమార్‌లు ఘటన స్థలానికి చేరుకొని డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు మునావర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత గొడవల కారణంగా స్నేహితులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: మహిళా కానిస్టేబుల్‌తో  వివాహేతర సంబంధం, ఎస్సైపై వేటు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top