ప్రేమలో గెలిచారు.. జీవితంలో ఓడారు

Lovers Commits Suicide In Tamil Nadu - Sakshi

మరణంలో ఒక్కటయ్యారు

చెన్నైలో బెంగళూరు ప్రేమజంట బలవన్మరణం

సాక్షి, చెన్నై: ప్రేమలో గెలిచిన ఓ జంట జీవిత పయనంలో ఓడారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో బలవన్మరణంతో ఒక్కటయ్యారు. బెంగళూరుకు చెందిన జంట చెన్నైలో రోడ్డు పక్కగా ఒకర్ని మరొకరు ఆలింగనం చేసుకున్న రీతిలో మృతదేహాలుగా కనిపించడం సర్వత్రా విషాదంలోకి నెట్టింది. పోలీసుల కథనం మేరకు... చెన్నై పళ్లికరణై మార్గం చిట్లపాక్కం అరసన్‌ కాలనీ నుంచి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పెరుంబాక్కం పోలీసులకు ఓ ఫోన్‌ కాల్‌ వెళ్లింది.

రోడ్డు పక్కగా ఓ యువతి, యువకుడు ఆలింగనం చేసుకున్న రీతిలో పడి ఉన్నట్టు వచ్చిన ఫోన్‌కాల్‌తో గస్తీ బృందం అక్కడికి వెళ్లింది. వారిని పరిశీలించగా, మరణించినట్టు తేలింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని విచారించారు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డు, చిరునామాల ఆధారంగా బెంగళూరు ఆర్‌కేపురానికి చెందిన వారుగా గుర్తించారు. చెన్నైకు ఎందుకు వచ్చారో అని విచారించగా, ఆ జంట ప్రేమ కథ వెలుగు చూసింది.

రెండేళ్లుగా ప్రేమ.. 
విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు అభినేష్‌(30), పల్లవి(30) బావ మరదళ్లుగా గుర్తించారు. అభినేష్‌ బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అభినేష్, పల్లవి రెండేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ వ్యవహారం పల్లవి తల్లి గాయత్రి దృష్టికి చేరింది. వీరి ప్రేమకు ఆమె అడ్డు చెప్పడమే కాదు, పల్లవిని తీవ్రంగా మందలించింది. దీంతో పది రోజుల క్రితం ఇళ్లు వదలి అభినేష్‌తో కలిసి చెన్నైకు పల్లవి చేరుకుంది. తాంబరం– చిట్లపాక్కం మార్గంలోని పిల్లయార్‌ కోవిల్‌ వీధిలోని తన సోదరి ఇంటికి పల్లవితో అభినేష్‌ చేరుకున్నాడు.

వీరి కోసం గాలింపు చేపట్టిన గాయత్రి ఎట్టకేలకు చెన్నైలో ఉన్నట్టు గుర్తించింది. అభినేష్‌ సోదరికి చీవాట్లు పెట్టింది. ఆందోళన చెందిన ఆమె ఇద్దరు బెంగళూరుకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. దీంతో అభినేష్, పల్లవి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. బెంగళూరుకు వెళ్తే విడదీస్తారాని, ప్రాణహాని తప్పదన్న ఆందోళన వారిలో నెలకొంది. దీంతో ప్రేమలో గెలిచిన తాము.. జీవిత పయనంలో ఓడుతున్నామని చాటుతూ మరణంలో ఒక్కటయ్యారు. ముందుగా  సిద్ధం చేసుకున్న విషాన్ని తాగి, తమను ఎవరూ విడదీయలేరన్నట్టుగా ఆలింగనం చేసుకున్న స్థితిలోనే మృత్యుఒడిలోకి చేరారు. వీరి మరణ సమాచారాన్ని బెంగళూరులోని కుటుంబసభ్యులకు పెరుంబాక్కం పోలీసులు తెలియజేశారు.

మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట జీహెచ్‌కు తరలించారు. వీరి బలన్మరణానికి కారణంగా గాయత్రిపై కేసు నమోదుకు చర్యలు చేపట్టారు. బెంగళూరు నుంచి మంగళవారం వస్తారనుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, ఎంతకు రాకపోవడంతో మృతదేహాల్ని మార్చురీలో ఉంచారు. ప్రేమజంట తమ ప్రాంతంలో బలవన్మరణానికి పాల్పడిన సమాచారంతో మృతదేహాలు పడి ఉన్న ప్రాంతానికి అర్ధరాత్రి వేళ కూడా అక్కడి  జనం పరుగులు తీయడంతో ఆ పరిసరాలు విషాదంతో నిండాయి.

చదవండి: 3 నెలల క్రితం అత్యాచారం.. రైల్వే స్టేషన్‌లో అస్థిపంజరం

ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top