Chennai News పరువు హత్య కేసు: ఉరే సరి

Kadalur Trial Court Awards Death Sentence To One Accused 2003 Honour Killing Of Couple - Sakshi

మృతురాలి అన్నకు ఉరిశిక్ష 

తండ్రి, ఇద్దరు పోలీసులు సహా  12 మందికి యావజ్జీవం

కడలూరు కోర్టు సంచలన తీర్పు 

సాక్షి ప్రతినిధి, చెన్నై: కులాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలు అంగీకరిచకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. అహం దెబ్బతినడంతో ఇరు కుటుంబాల వారూ కూడబలుక్కుని ఆ జంటను అతి కిరాతకంగా హతమార్చారు. నేరం రుజువుకావడంతో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్‌ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది.
చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

కేసు వివరాలు 
కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్తానికి చెందిన స్వామికన్ను కుమారుడు మురుగేశన్‌ (25) బీఈ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. దళితుడైన మురుగేశన్‌ అదే ప్రాంతంలో మరో సామాజిక వర్గానికి చెందిన దురైస్వామి కుమార్తె కన్నగి (22) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో 2003 మే 5వ తేదీ కడలూరు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరిళ్లలో వారు వేర్వేరుగా గడిపేవారు. ఓ దశలో ఇరువురు ఇంటి నుంచి పారిపోయారు. మురుగేశన్‌ తన భార్య కన్నగిని విళుపురం జిల్లాలోని బంధువుల ఇంట్లో ఉంచి కడలూరు జిల్లాల్లోని తన బంధువుల ఇంటిలో ఉండేవాడు. మురుగేశన్‌ బాబాయ్‌ అయ్యాస్వామి సహకారంతో కన్నగి తల్లిదండ్రులు 2003 జూలై 8వ తేదీ ఇద్దరినీ ఇంటికి తెచ్చుకున్నారు.
చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన

ఆ తరువాత మరికొందరితో కలిసి మురుగేశన్, కన్నగిలను కుప్పందత్తం గ్రామ శ్మశానికి తీసుకెళ్లి ముక్కు, చెవుల ద్వారా విషాన్ని ప్రవేశపెట్టి హతమార్చారు. వారిద్దరి శవాలను అదే శ్మశానంలో తగులబెట్టారు. మురుగేశన్‌ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దారుణాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే మీడియాలో మార్మోగిపోవడంతో కేసు నమోదు చేసి ఇరుపక్షాలకు చెందిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. జాతివిధ్వేషాలతో జరిగిన హత్యలు కావడంతో పలువురి డిమాండ్‌ మేరకు 2004లో ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది.

అప్పటి విరుదాచలం ఇన్‌స్పెక్టర్‌ చెల్లముత్తు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తమిళ్‌మారన్‌ సహా 15 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీటు దాఖలు చేసింది. మొత్తం 81 మంది సాక్షులను విచారించగా వీరిలో సెల్వరాజ్‌ అనే సాక్షి ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్‌రాజా ఈ కేసుపై శుక్రవారం తీర్పు చెప్పారు.

కన్నగి అన్న మరుదుపాండికి ఉరిశిక్ష, తండ్రి దురైస్వామి, ఇరుపక్షాల బంధువులు రంగస్వామి, కందవేలు, జ్యోతి, వెంకటేశన్, మణి, ధనవేల్, అంజాపులి, రామదాస్, చిన్నదురై, తమిళ్‌మారన్, అప్పటి సీఐ చెల్లముత్తు, (ప్రస్తుతం విశ్రాంత డీఎస్పీ), ఎస్‌ఐ తమిళ్‌మారన్‌ (సీఐగా సస్పెన్షన్‌) సహా మొత్తం 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరిలో కన్నగి తండ్రి దురైస్వామి సహా ఐదుగురికి రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 15 మంది నిందితుల్లో మురుగేశన్‌ తరఫు అయ్యాస్వామి, గుణశేఖరన్‌లను నిర్దోషులుగా విడిచిపెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top