
వధూవరులతో పోలీసు అధికారులు
గంగావతి: నిందితులతో పోలీసుల సంబంధాలు మితిమీరితే వారి ఉద్యోగాలకే హాని చేయవచ్చు. గంగావతి పోలీసు అధికారులు ఓ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి ఇంట జరిగిన పెళ్లికి వెళ్లారు. దీంతో వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పలేదు. కనకగిరి తాలూకా హులిహైదర్ గ్రామానికి చెందిన హనుమంతేష్ నాయక్ కొడుకు ఆనంద్ వివాహానికి గంగావతి డీవైఎస్పీ రుద్రష్ ఉజ్జినకొప్ప, రూరల్ సీఐ ఉదయ్‌రవి, కనకగిరి పీఎస్‌ఐ తారబాయ్‌లు హాజరయ్యారు.
నూతన వధూవరులను ఆశీర్వదించి పూలదండలు వేయించుకుని సన్మానమూ అందుకున్నారు. విందు కూడా స్వీకరించారు. ఇలా చేయడం సబబు కాదని తలచిన ఐజీ, డీజీపీలు వారిపై కన్నెర్ర చేశారు. తక్షణం సెలవు పెట్టి వెళ్లాలని ఆదేశించారు. కొప్పళ ఎస్పీ టీ.శ్రీధర్ ఈ మేరకు ఆ ముగ్గురికి ఉత్తర్వులు పంపారు. వారి స్థానాల్లో కొత్తవారికి చార్జిని అప్పగిస్తారు.