ఇక్కడ స్నానం చేయకూడదు అన్నందుకే తలపై..

Hyderabad: Man Deceased Pestle Suggesting Not To Bath Hand Pump - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(అఫ్జల్‌గంజ్‌): అ చేతి పంపు వద్ద స్నానం చేయ వద్దన్నందుకు ఓ వ్యక్తిని రోకలితో మోది హత్య చేసిన సంఘటన మంగళవారం అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నారాయణపేట జిల్లా, జలాల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన పురుషోత్తం రెడ్డి (35) గత కొంత కాలం క్రితమే నగరానికి వచ్చాడు.

చాదర్‌ఘాట్‌ వద్ద ఉన్న సాయి బాబా దేవాలయం వద్ద ఉంటూ ప్రసాదాలు, దాతలు ఇచ్చే ఆహారం తింటూ ఫుట్‌పాత్‌పై నివాసం ఉండేవాడు. కాగా మంగళవారం దేవాలయం సమీపంలో ఉన్న చేతి పంపు వద్ద నేపాల్‌కు చెందిన బహద్దూర్‌ (30) చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన పురుషోత్తం రెడ్డి ఇక్కడ చేతులు కడుక్కోవద్దని అభ్యంతరం చెప్పాడు. ఈ విషయమై ఇరువురి మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన బహద్దూర్‌ పురుషోత్తం రెడ్డిపై రోకలిబండతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, ఎస్సై మాన్‌సింగ్, క్లూస్‌ టీం, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీ టీవి పుటేజీని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

చదవండి: అత్తతో తగాదా.. అశ్లీల ఫొటోలు పంపి బ్లాక్‌మెయిల్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top