చాక్లెట్‌ బార్‌లలో గంజాయి!  | Hyderabad: Man Arrested For Selling Marijuana Laced Chocolates | Sakshi
Sakshi News home page

చాక్లెట్‌ బార్‌లలో గంజాయి! 

Published Sun, Nov 6 2022 4:07 AM | Last Updated on Sun, Nov 6 2022 4:07 AM

Hyderabad: Man Arrested For Selling Marijuana Laced Chocolates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అతని పేరు రిషి సంజయ్‌ మెహతా (22)... తల్లిదండ్రులు ఓ ఫార్మా కంపెనీ యజమానులు... చదివేది అమెరికాలోని ఫీనిక్స్‌ యూనివర్సిటీ నుంచి ఆన్‌లైన్‌ ఎంబీఏ. అయితేనేం... మాదకద్రవ్యాలకు బానిసగా మారాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు హష్‌ ఆయిల్‌ (ఓ రకమైన గంజాయి గుజ్జు)తో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తూ హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులకు చిక్కాడు.

ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... రిషి సంజయ్‌ మెహతాకు కాలేజీ రోజుల నుంచే హష్‌ ఆయిల్‌ సహా ఇతర డ్రగ్స్‌ వినియోగం అలవాటైంది. ఆపై డ్రగ్‌ పెడ్లర్‌గా మారాడు. ప్రస్తుతం హష్‌ చాక్లెట్స్‌ తయారీ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తుండటంతో ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులు ఫార్మా కంపెనీకి వెళ్లగానే బెడ్‌రూమ్‌లోనే వాటిని తయారు చేస్తున్నాడు.

దీనికి అవసరమైన ఉపకరణాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. విశాఖలోని చింతపల్లికి చెందిన రామారావు గంజాయి నుంచి ఈ హష్‌ ఆయిల్‌ తయారు చేస్తున్నాడు. ఇది సూరారానికి చెందిన బోనాల వినోద్, కె.శ్రీకాంత్‌ యాదవ్‌ల చేతులు మారి సి.రోహిత్‌కు చేరుతోంది. అతన్నుంచి 5 గ్రాముల బాటిల్‌ను రూ. 3 వేలకు రిషీ కొంటున్నాడు. తొలినాళ్లలో దీన్ని ఈ–సిగరెట్లు, బ్రౌనీస్‌లో (తినుబండారం) ఉంచి విక్రయించినా లాభసాటిగా లేకపోవడంతో ఇంటర్నెట్‌లో చూసి హష్‌ ఆయిల్‌ చాక్లెట్ల తయారీ మొదలెట్టాడు. 

తయారీ ఇలా... 
మార్కెట్‌ నుంచి ముడి చాక్లెట్‌ను 4 కేజీల చొప్పున రిషి కొనుగోలు చేసి అందులో 40 గ్రాముల హష్‌ ఆయిల్‌ కలుపుతున్నాడు. ఆపై ఆ ద్రవాన్ని పోతపోసి చాక్లెట్లుగా మారుస్తున్నాడు. ఆ సమయంలోనే ఓరియో, కిట్‌క్యాట్, క్యాట్‌బర్రీ వంటి ఫ్లేవర్లు కలుపుతున్నాడు. ఈ మిశ్రమాన్ని డీఫ్రిజ్‌లో పెట్టి చాక్లెట్‌ బార్స్‌గా మారుస్తున్నాడు. వాటిని సిల్వర్‌ ఫాయిల్‌తో కూడిన వేఫర్లలో చుట్టి ఒక్కోటి రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు అమ్ముతున్నాడు.

అతనికి నగరంలోనే 100 మంది కస్టమర్లు ఉన్నారు. రిషీ దందాపై సమాచారం అందుకున్న హెచ్‌–న్యూ ఇన్‌స్పెక్టర్‌ పి.రాజేశ్, ఎస్సై జీఎస్‌ డానియేల్‌లతో కూడిన బృందం అతనిపాటు వినోద్, శ్రీకాంత్, రోహిత్‌లను పట్టుకుంది. పరారీలో ఉన్న రామారావు కోసం గాలిస్తోంది. అతన్నుంచి 48 హష్‌ చాక్లెట్‌ బార్స్, 40 గ్రాముల హష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకుంది. రిషీ నుంచి చాక్లెట్‌ బార్‌లు కొనుగోలు చేసిన వాళ్లు అందులోని 15 పీసులను విడగొట్టి ఒక్కో పీస్‌ను గరిష్టంగా రూ. 2 వేల చొప్పున రూ. 30 వేలకు అమ్ముతుండటం గమనార్హం. ఒక్కో చాక్లెట్‌ బార్‌ తినడం ద్వారా వినియోగదారులు 6 గంటల వరకు మత్తులో జోగుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement