దారుణం: వంట చేస్తున్న భార్యపై డీజిల్‌ పోసిన భర్త  

Husband Assasinate His Wife In Mahabubnagar - Sakshi

సాక్షి, కొత్తకోట(మహబూబ్‌నగర్‌): వంట చేస్తున్న భార్యపై భర్త డీజిల్‌ పోయడంతో మంటలు అంటుకుని భార్య తీవ్రంగా గాయపడింది. అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన బుధవారం  వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం... మండలంలోని చిలకటోనిపల్లికి చెందిన రాధిక(20)ను ఏడాది క్రితం వీరాయిపల్లి గ్రామానికి చెందన రమేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి కట్నంగా రూ.50వేలు రెండున్నర తులాల బంగారు కుదుర్చుకున్నారు.

పెళ్లిరోజు కట్నం డబ్బులు రూ.50వేలు మాత్రమే రమేష్‌కు ఇచ్చారు. దీంతో కొంతకాలంగా బంగారం తేవాలని రాధికపై ఒత్తిడి తేవడం, అదనంగా కట్నం కావాలని ఇబ్బందిపెట్టేవాడు. మంగళవారం రాత్రి రాధిక ఇంటిముందు కట్టెల పొయ్యిమీద వంట చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రమేష్‌ కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న డీజిల్‌ డబ్బాను తెచ్చి ఒక్కసారిగా రాధిక ఒంటిపై పోశాడు. పక్కనే ఉన్న మంట అంటుకుంది.

తాళలేని ఆమె అరుపులు, కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న రాధికను వెంటనే వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సీహెచ్‌ రాజు ఆస్పత్రికి వెళ్లి రాధికతో వాంగ్మూలం తీసుకున్నారు. ఈ మేరకు హత్యాయత్నం, గృహహింస, వరకట్నం వేధింపుల చట్టం కింద భర్తపై కేసు నమోదు చేశామన్నారు. వీరికి రెండు నెలలబాబు ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top