సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

Governor Tamilisai Respond On Saroor Nagar Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు. కాగా, రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పరువు హత్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి (23) కళాశాలలో స్నేహితులు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్‌ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
చదవండి: సరూర్‌ నగర్‌ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’

నాగరాజు మలక్‌పేటలోని ఓ కార్ల షోరూంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారు సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ వైపు వెళుతున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌ను ఆపారు. యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్‌ రాడ్‌తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. తమ కళ్లెదుటే జరిగిన దారుణాన్ని చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడ్డారు.

నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top