సరూర్‌నగర్‌ పరువు హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నాను, ఎవరూ ముందుకు రాలేదు’

hyderabad: Saroornagar Honour Killing Latest Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లో పరువు హత్య చేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హంతకులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సరూర్ నగర్‌లో బుధవారం రాత్రి పరువు హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

నాగరాజు, అశ్రీన్‌ దంపతులు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకొని దాడి చేశారు. నాగరాజును ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 31న ఆర్య సమాజ్‌లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కార్ల షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

ఈ మేరకు మృతుడు నాగరాజు భార్య అశ్రీన్‌ మాట్లాడుతూ.. ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా తన భర్తపై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారని పేర్కొంది. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కిందపడేశారని, నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి చంపారని తెలిపింది. హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ మీది నుంచి కొట్టి తలను తీవ్రంగా గాయపరిచారని వాపోయింది. 

‘నాగరాజును కొట్టొద్దంటూ నేను అతని మీద పడ్డాను. నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టారు. కాపాడమని గుమిగూడిన వారందరిని కాళ్లు పట్టుకున్నాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజుకు కూడా చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను. చినరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి’ అని మీడియా ముందు వాపోయింది.

ఇద్దరే నిందితులు: ఏసీపీ
నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకంటామని ఏసీపీ తెలిపారు.

నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు: డీసీపీ
ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సరూర్ నగర్ పీఎస్ పరిధిలో గత రాత్రి నాగరాజు అనే వ్యక్తి పై ఇద్దరు దుండగులు దాడి చేశారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసామన్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించి ఇద్దరిని ట్రెస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ లుగా గుర్తించామన్నారు. వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లి చెందిన బిల్లపురం నాగరాజు జనవరిలో మోబిన్ అహ్మద్ సోదరి సుల్తానా అశ్విన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో వాళ్లు నాగరాజు పై కక్ష్య పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు. నిన్న నాగరాజు పనిచేస్తున్న  మలక్ పేట మారుతి షోరూం వద్ద మోబిన్ గుర్తించాడు.  జనం ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి హత్య చేశారని చెప్పారు. బంధువు మసూద్ తో కలిసి మోబిన్ సుల్తానా ను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డు తో దాడి చేసి పారిపోయారని డీసీపీ తెలిపారు. ఫాస్ట్రాక్ కోర్టు లో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top