సరూర్‌నగర్‌లో పరువు హత్య 

Hyderabad: Man Killed in Suspected Honour Killing in Saroornagar - Sakshi

యువకుడిని కిరాతకంగా చంపిన యువతి బంధువులు! 

నడిరోడ్డుపై రాడ్డుతో కొట్టి దారుణం 

మతాంతర వివాహం కారణమనే అనుమానాలు 

చైతన్యపురి (హైదరాబాద్‌):  రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి (23) కళాశాలలో స్నేహితులు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్‌ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

యువకుడు మలక్‌పేటలోని ఓ కార్ల షోరూంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారు సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ వైపు వెళుతున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌ను ఆపారు. యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్‌ రాడ్‌తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. తమ కళ్లెదుటే జరిగిన దారుణాన్ని చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

ప్రేమ వివాహమే కారణం: ఏసీపీ 
హత్యోదంతం తెలుసుకున్న ఎల్‌బీనగర్‌ క్రైమ్‌ డీసీపీ యాదగిరి, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సరూర్‌నగర్‌ సీఐ సీతారాం, ఎస్‌ఐ లక్ష్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు ప్రేమ వివాహమే కారణమని, నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తామని ఏసీపీ తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top