బాలికపై సామూహిక లైంగిక దాడి | Gang molestation on girl | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక లైంగిక దాడి

Dec 12 2024 5:30 AM | Updated on Dec 12 2024 5:30 AM

Gang molestation  on girl

ఆలస్యంగా వెలుగు చూసిన వైనం

నిందితుల అరెస్టు

బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో ఘటన

కొల్లూరు: ఓ బాలికను మభ్యపెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొల్లూరులోని ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తుంది. గత నెల 26న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన గ్రామానికి వెళ్లడానికి ఆటో కోసం వేచి ఉండగా, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్‌కుమార్‌ తన ద్విచక్ర వాహనంపై ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఎక్కించుకున్నాడు.

కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువున ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులకు ఫోన్‌ చేసి పిలవడంతో బెజ్జం శ్యామ్‌కుమార్‌తో పాటు మరో యువకుడు అక్కడకు వచ్చారు. శ్యామ్‌కుమార్‌ బాలికను తన ద్విచక్ర వాహనంపై దింపుతానని మభ్యపెట్టి వేరే ఇటుక బట్టీలోకి తీసుకువెళ్లి అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువకుడు వెంటనే వెళ్లిపోయాడు.

అనంతరం బాలికను ఇటుక బట్టీలలోనే వదిలి వెళ్లడంతో రాత్రి సమయంలో కాలినడకన ఇంటికి చేరుకుంది. తల్లి లేని ఆ బాలిక జరిగిన అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పుకునేందుకు భయపడింది. కొద్ది రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన తండ్రి తమ బంధువులకు చెప్పడంతో విషయం బయటపడింది. అనంతరం తండ్రి  ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

బుధవారం రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు  విచారణ చేపట్టారు. నిందితులు విప్పర్ల ప్రేమ్‌కుమార్, బెజ్జం శ్యామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన ప్రాంతాన్ని వేమూరు సీఐ రామాంజనేయులు, కొల్లూరు ఎస్‌ఐ జి. ఏడుకొండలు  పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement