అమ్మ, అమ్మమ్మ కలిసి.. అమ్మాయిని అమ్మబోయి..

Family Members Sell 14 Year Old Girl In Balapur At Hyderabad - Sakshi

రూ.3 లక్షలకు 14 ఏళ్ల బాలికను విక్రయించేందుకు ప్రయత్నం

ముంబైకి చెందిన వ్యక్తికి అప్పగించేందుకు ఏర్పాట్లు

రక్షించిన పోలీసులు.. 9 మంది అరెస్టు

పహాడీషరీఫ్‌: పేదరికమో, మరో కారణమో.. డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది.. భార్యకు విడాకులిచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ల వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమైంది. అమ్మ, అమ్మమ్మ కలిసి.. మరో ఐదుగురు మహిళలు మధ్యవర్తులుగా నిలిచి.. చేయబోయిన ఈ దారుణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి దాడులు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఇన్‌స్పెక్టర్‌ బి.భాస్కర్‌ తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన సయ్యద్‌ అల్తాఫ్‌ అలీ (61) ఆరేళ్ల క్రితం తన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు మరో తోడు అవసరమని భావించాడు. ఇందుకోసం హైదరాబాద్‌లోని క్యూబా కాలనీలో నివాసం ఉండే అఖిల్‌ అహ్మద్‌ (37)ను సంప్రదించాడు. ఇద్దరూ కలిసి షాహీన్‌నగర్, చాంద్రాయణగుట్ట పరిసరాలకు చెందిన మహిళలను అక్రమంగా రవాణా చేసే జరీనా బేగం (25), షబానా బేగం (38), షమీం సుల్తానా (45), నస్రీన్‌ బేగం (40), జాహెద్‌బీ (72)లను మధ్యవర్తులుగా పెట్టుకున్నారు. ఈ మధ్యవర్తులు బండ్లగూడ నూరీ నగర్‌కు చెందిన అష్రియా బేగం కుమార్తె (14 ఏళ్లు)ను అల్తాఫ్‌ అలీకి రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఆమె అమ్మమ్మ చాంద్‌ సుల్తానా (65) సమక్షంలో మూడు నెలల కింద ఒప్పందం కుదుర్చుకున్నారు.

కానీ అల్తాఫ్‌ డబ్బు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో ఒప్పందం రద్దయింది. అయితే కొద్దిరోజుల కింద బాలిక మేనమామకు ప్రమాదం జరిగి, డబ్బులు అవసరం పడ్డాయి. దీనితో అష్రియా బేగం తన బిడ్డను విక్రయించేందుకు సిద్ధమై మధ్యవర్తులను ఆశ్రయించింది. వారు వెంటనే ముంబైకి చెందిన అల్తాఫ్‌ అలీకి సమాచారమిచ్చారు. డబ్బు అత్యవసరం కావడంతో ఈసారి రూ.3 లక్షలకే బాలికను కొనేందుకు బేరం కుదుర్చుకొన్నారు. డబ్బు చెల్లించి బాలికను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో.. బాలాపూర్‌ ఎస్సై శ్రీకాంత్‌ నేతృత్వంలోని పోలీసు బృందం ఆదివారం రాత్రి దామని ఎర్రకుంటలో దాడులు చేసింది. తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసి బాలికను రక్షించింది. పోలీసులు నిందితులపై పోక్సో, మహిళల అక్రమ రవాణా చట్టాల కింద కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top