హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి.. శవంపై డ్యాన్స్‌ | An Elderly Woman Lost Her Life In Kushaiguda Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి.. శవంపై డ్యాన్స్‌

Apr 15 2025 11:17 AM | Updated on Apr 16 2025 8:56 AM

An Elderly Woman Lost Her Life In Kushaiguda Hyderabad

హైదరాబాద్‌: తన స్వీయ రక్షణ కోసం పెట్టుకున్న ఆయుధమే ఆమె పాలిట యమపాశమైంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఓ మైనర్‌ అతికిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా వృద్ధురాలి శవంపై నిలబడి డ్యాన్సులు చేసుకుంటూ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత తాను ఓ ఘనకార్యం చేశానంటూ మిత్రుడికి ఫోన్‌ చేసి హత్య చేసిన వీడియోను షేర్‌ చేశాడు. అలా వీడియో కాస్తా వైరల్‌ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 11న చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు..రాజస్తాన్‌కు చెందిన పుక్‌రాజ్‌ చౌదరి, కమలాదేవి (70) దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చి మీర్‌పేట్‌–హెచ్‌బీకాలనీ డివిజన్, కృష్ణానగర్‌ కాలనీ రోడ్డు నెంబరు–5లో ఉంటున్నారు. వారికి సంతానం లేదు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో కమలాదేవి ఒంటరిగానే ఉంటుంది. మొదటి అంతస్తులో ఆమె నివాసముంటూ గ్రౌండ్‌ఫ్లోర్‌లో షాపులను తన బంధువులకు అద్దెకిచ్చింది. అద్దె షాపుల్లో ప్రకాశ్‌ చౌదరి అనే వ్యక్తి హార్డ్‌వేర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. 8 నెలల క్రితం రాజస్తాన్‌కు చెందిన ఓ బాలుడిని (17)  షాపులో పనికి పెట్టుకున్నాడు. 

ఈ క్రమంలో కమలాదేవికి బాలుడితో పరిచమైంది. కొన్ని విషయాల్లో కమలాదేవి ఆ బాలుడిని మందలించింది. దీన్ని మనసులో పెట్టుకున్న బాలుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయిచుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 10:15 గంటల సమయంలో కమలాదేవి ఇంట్లోకి వెళ్లి తనకు ఆకలిగా ఉందని చెప్పాడు. ఆమె రొట్టె చేసి ఇస్తానని చెప్పి పిండి సిద్ధం చేస్తుండగా..అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్‌ను తీసుకుని వెనుకనుంచి ఆమె తలపై బలంగా  మోదాడు. కమలాదేవి రక్షణ కోసం పెట్టుకున్న రాడ్‌తోనే ఆమెపై దాడి చేశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో రాడ్‌తో బలంగా గొంతులో పొడిచి ఆమె చీర కొంగుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన వృద్ధురాలి గొంతు, చాతిపై నిలబడి డ్యాన్సులు చేస్తూ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. 

రాత్రి 12:30 గంటల సమయంలో ఇంట్లోంచి ఓ కవరుతో బయటకు వచ్చి తాను ఉంటున్న ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు, ఆ తర్వాతి రోజు కూడా ఏం తెలియనట్లు షాపునకు వచ్చాడు. హత్య చేసిన మరుసటి రోజు పైకి వెళ్లి విగతజీవిగా పడి ఉన్న కమలాదేవిని చూసి వచి్చన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతటితో ఆగకుండా ఈ నెల 14న బెంగుళూరులో ఉంటున్న మిత్రుడు సురేందర్‌కు ఫోన్‌ చేసి తాను ఓ ఘనకార్యం చేశానంటూ గొప్పగా చెప్పాడు. 

కమలాదేవిని హత్య చేసిన విషయాన్ని మిత్రుడికి చెప్పాడు. సరదాగా అంటున్నాడనుకొని మొదట నమ్మలేదు. దీంతో తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోను మిత్రుడికి షేర్‌ చేశాడు. కంగుతిన్న సురేందర్‌ వెంటనే కిషన్‌సింగ్‌ పనిచేస్తున్న షాపు యజమానికి విషయం తెలియపరిచాడు. స్థానిక పెద్దల సాయంతో విషయాన్ని పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడంతో పాటుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement