గోవా టు హైదరాబాద్‌.. అతిపెద్ద డ్రగ్‌ దందా గుట్టురట్టు చేసిన హెచ్‌ న్యూ టీమ్‌

Drugs Smuggling From Goa To Hyderabad Nigerian Arrested - Sakshi

నైజీరియాకు చెందిన పెడ్లర్‌ జేమ్స్‌ అరెస్ట్‌

30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం

108 మందికి విక్రయించినట్లు ఆధారాలు.. వీరిలోప్రముఖులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు

హిమాయత్‌ నగర్‌: గోవా టు హైదరాబాద్‌ మధ్య నడుస్తున్న అతిపెద్ద డ్రగ్‌ ముఠా గుట్టును హెచ్‌ న్యూ టీమ్‌ రట్టుచేసింది. నైజీరియాకు చెందిన ఒసిగ్వే చుక్వేమెక జేమ్స్‌ అలియాస్‌ అలమాంజో నామ్‌సి­చ్‌క్వూను అరెస్ట్‌ చేసింది. అతడి వద్ద నుంచి అతిప్రమాదకరమైన 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను మూడు దేశాలకు చెందిన నగదు తోపాటు నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసు కుంది. జేమ్స్‌ను నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని నియాజ్‌ఖానా వద్ద స్థానిక పోలీసులతో కలసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సెంట్రల్‌జోన్‌ డీసీపీ రాజేష్‌చంద్ర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. 

దొంగ పాస్‌పోర్ట్‌లతో మకాం
నైజీరియాకు చెందిన జేమ్స్‌ 2016 నుంచి 2019 వరకు అధికారిక పాస్‌పోర్ట్‌తో టూరిస్ట్‌గా ఇండియాకు వస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గోవా, బెంగళూరులోని కొందరు డ్రగ్‌ పెడ్లర్‌ (అక్రమంగా మత్తుమందు సరఫరా చేసేవారు)లతో పరిచయాలు పెంచుకున్నాడు. 2021లో మరోమారు ఇండియాకు వచ్చిన జేమ్స్‌ పాస్‌పోర్ట్‌ గడువు ముగియడంతో పలు పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లను రూపొందించుకున్నాడు.

గోవా, హైదరాబాద్‌ నుంచి నైజీరియాకు వెళ్లి వస్తున్నాడు. గోవాలో ఎండీఎంఏ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసులు జేమ్స్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. మూడు నెలల తర్వాత ఇటీవల జైలు నుంచి వచ్చిన జేమ్స్‌ గోవా నుంచి తన మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. అంతర్జాతీయ డ్రగ్‌ పెడ్లర్‌ అయిన నైజీరియన్‌ జాక్‌తో వాట్సాప్‌ ద్వారా కాంటాక్ట్‌లో ఉన్నాడు.

జాక్‌ చెప్పినట్లు గోవా, బెంగళూరు నుంచి డ్రగ్‌ను సేకరించి హైదరాబాద్‌లో అమ్మకాలు చేస్తున్నాడు. 108 మంది కస్టమర్లకు రెగ్యులర్‌గా డ్రగ్‌ను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రముఖులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు అధికంగా ఉన్నారు. 60 మంది వివరాలను సేకరించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్‌న్యూ టీమ్‌ ఆరు నెలల వ్యవధిలో 60 కేసులు నమోదు చేసి దేశవ్యాప్తంగా 250 మంది డ్రగ్‌ పెడ్లర్‌లను అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top