డిప్యూటీ తహసీల్దార్‌ బలవన్మరణం

Deputy Tahsildar Ends His Life At Kurnool District - Sakshi

బనగానపల్లె రూరల్‌: ఉరి వేసుకుని డిప్యూటీ తహసీల్దార్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. డోన్‌ పట్టణానికి చెందిన సురేంద్ర(35)కు బనగానపల్లె పట్టణం రాంభూపాల్‌ నగర్‌కు చెందిన రంగనాయకులు కూతురు జగదీశ్వరితో వివాహమైంది. సురేంద్ర నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా, జగదీశ్వరి కోవెలకుంట్ల సెబ్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ బనగానపల్లెలోని రాంభూపాల్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి రుత్విక్, ఆదిత్య అనే ఇద్దరు చిన్నారులు సంతానం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేంద్ర రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని ఆదివారం ఇంటికి వచ్చారు.

ఉదయం భార్య డ్యూటీకి వెళ్లగా తనకు ఒంట్లో నలతగా ఉందని ఇంట్లోనే ఉండిపోయారు. కార్తీక సోమవారం కావడంతో పిల్లలిద్దరినీ మామ(జగదీశ్వరి తండ్రి) రవ్వల కొండకు తీసుకెళ్లాడు.  ఒంటరిగా ఉన్న సురేంద్ర ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రండ్యూటీ నుంచి వచ్చిన భార్య తలుపులు తీయగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండటం చూసి బోరున విలపించింది.

కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పేయి, తహసీల్దార్‌ ఆల్‌ఫ్రెడ్‌ ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top