Sakshi News home page

కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి

Published Sun, Mar 31 2024 2:56 AM

Dalit youth attacked for stealing amplifier - Sakshi

పంచాయతీ ఆఫీసు కిటికీకి కట్టి.. చిత్రహింసలు పెట్టి

డీజే యాంప్లిఫైయర్‌ చోరీ చేశాడని దళిత యువకుడిపై దాడి

సంచలనం రేపిన వీడియో

కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్‌) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్‌ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్‌ యజమాని గద్ద అశోక్‌ పనికి పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో డీజే(సౌండ్‌ బాక్స్‌)లో ఉపయోగించే యాంప్లిఫైయర్‌ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్‌లో విక్రయించారని యజమాని అశోక్‌ గుర్తించాడు. దీంతో అశోక్‌ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్‌తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు.

ఒంటిపై షర్ట్‌ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇరువర్గాలపై కేసులు
టెంట్‌హౌస్‌ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్‌పై చోరీ కేసు, కార్తీక్‌పై దాడి చేసిన ఘటనలో అశోక్‌తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్‌ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. 

Advertisement
Advertisement