
పెద్ద మొత్తంలో రసగుల్లాలు తయారుచేయించి పంచటం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న...
లక్నో : కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయటంతో పాటు 20 కేజీల రసగుల్లాలను సీజ్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటితో పాటు ఉత్తర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ విజయోత్సవ వేడుకలు జరుపుకోరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
గత ఆదివారం ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన హపుర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో రసగుల్లాలు తయారుచేయించి పంచటం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 కేజీల రసగుల్లాను స్వాధీనం చేసుకున్నారు.