
శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ ఎబ్రార్ ఖాన్ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్ యజమాని ఎం.డి.అయూబ్(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్‌కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు.
వలస కుటుంబంలో విషాదం..
హోటల్ యజమాని ఎం.డి. అయూబ్ పదిహేనేళ్ల జార్ఖండ్ రాష్ట్రం చత్‌గల్ జిల్లా సత్‌గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.