ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య | Burglars murder three of family in Tirupur | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య

Nov 30 2024 12:13 PM | Updated on Dec 1 2024 1:33 PM

Burglars murder three of family in Tirupur

సేలం (త‌మిళ‌నాడు): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురైన సంఘటన పల్లడంలో శుక్రవారం కలకలం రేపింది. ఐదు ప్రత్యేక బృందాల పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుపూర్‌ జిల్లా పల్లడం సమీపంలోని పొంగలూర్‌ సమీపం సోమలైకౌండంపాళయం ప్రాంతానికి చెందిన దైవశికామణి (76). తన ఫామ్‌హౌస్‌లో భార్య అలమేలు (65)తో కలసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతని కుమారుడు సెంథిల్‌కుమార్‌ (45). ఇతను భార్యాపిల్లలతో కోవైలో ఉంటు న్నాడు. కోవైలో ఉన్న ఐటీ సంస్థలో పనిచేస్తున్న సెంథిల్‌కుమార్‌ సోమలై కౌండంపాళయంలో ఉన్న బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు గురువారం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. రాత్రి ఇంట్లో ముగ్గురు నిద్రించారు.  

ముగ్గురు దారుణ హత్య  
అర్ధరాత్రి తోటలో నుంచి శబ్దం రావడంతో ముందు దైవశికామణి వెళ్లి చూశాడు. అప్పుడు అక్కడే దాగి ఉన్న గుర్తుతెలియని దుండగులు దైవశికామణిని కత్తులతో నరికి హత్య చేశారు. ఆ తర్వాత ఇంటిలోపలికి చొరబడి నిద్రపోతున్న సెంథిల్‌కుమార్, తల్లి అమలాత్తాల్‌లను కూడా నరికి హతమార్చి పరారయ్యారు. ఈ స్థితిలో సెంథిల్‌ కుమార్‌ పిలిచిన బార్బర్‌ శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ముగ్గురు మృతదేహాలుగా పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే అవినాశిపాలయం పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు.  పల్లడం పోలీసు కమిషనర్‌ సురేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపంచనామా నిమిత్తం తిరుపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

ఐదు ప్రత్యేక బృందాల ఏర్పాటు 
ఇంట్లో బీరువా పగులగొట్టి వస్తువులు అన్ని చెల్లాచెదురుగా పడి కనిపించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న తిరుపూర్‌ పోలీసు కమిషనర్‌ లక్ష్మి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో 8 సవర్ల నగలు చోరీ అయినట్టు గుర్తించారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు హత్యకు గురైన సంఘటన దిగ్భ్రాంతిని, శోకాన్ని నింపింది.  పోలీసు కమిషనర్‌ లక్ష్మీ మాట్లాడుతూ ఈ హత్యలు ఒక వ్యక్తి చేసే అవకాశం లేదని, చోరీకి గురైన నగల గురించి విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇందుకుగాను ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు ఆమె తెలిపారు. సెంథిల్‌ కుమార్‌ కుటుంబం హత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలంటూ ఆయన భార్య కవిత ఆందోళన చేపట్టింది.  

పోలీసుల మరో కోణం  
కాగా దైవశికామణి ఇంట్లో సాయల్‌కుడికి చెందిన దంపతులు గతంలో పని చేశారని, అయితే ఆ సమయంలో ఏర్పడిన గొడవ కారణంగా వారిని దైవశికామణి పని నుంచి తొలగించాడని, ఆ విషయంగా వారికి పాతకక్షలు ఉన్నట్టు సమాచారం. సెంథిల్‌కుమార్‌ పని నుంచి తొలగించిన వ్యక్తి గత 15 రోజులుగా ఆ ప్రాంతంలో తచ్చాడుతూ కనిపించాడని తెలిసింది. ఒక వేళ ఈ హత్యకు వారే కారణమా అనే మరో కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement