నైతికత నిండిన సమాజం సృష్టిద్దాం!
సాక్షి, చైన్నె: నైతికత, కరుణతో కూడిన సమాజాన్ని సృష్టించేందుకు అందరం సమష్టిగా కృషి చేద్దాం అని సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. వల్లలార్ ఉద్దేశాలను, ఆయన ఖ్యాతిని ఎలుగెత్తి చాటుదామన్నారు. వల్లలార్ వెలిగించిన జ్యోతి లాగా తమిళనాట ద్రావిడ మోడల్ శాశ్వతం అని వ్యాఖ్యానించారు. వివరాలు.. చైన్నెలో హిందూ మత ధార్మిక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వల్లలార్ సదస్సు 2026 కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ధర్మంతో కూడిన చైన్నె అని వల్లలార్ కొనియాడిన ఈ నగరంలో ఆయన చూపిన నైతికతను అనుసరించే ఆధ్యాత్మికులను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. వేల సంవత్సరాల పురాతన దేవాలయాల పునర్నిర్మాణం, ఆలయ రక్షణ కోసం ప్రభుత్వ నిధులు అంటూ తన ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన పనులను ఈ సందర్భంగా వివరించారు. ఆలయాల్లో జరుగుతున్న నిత్య పూజలు, వివిధ ఉత్సవాలను గుర్తు చేస్తూ, సామూహిక వివాహాల నిర్వహణ గురించి పేర్కొన్నారు. వల్లలార్‌ను మనం ఎందుకు ఉన్నతంగా ఉంచుతున్నామో అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆయన కరుణ, ప్రేమ మార్గాన్ని బోధించారని, ఈ మార్గంలోనే ద్రావిడ మోడల్ ప్రభుత్వం సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. వల్లలార్ తమిళ సమాజంలో ఉద్భవించిన మహనీయుడు అని ఆయన సిద్ధాంతాలను అనేక సందర్భాలలో తాను ఉటంకిస్తూ వ్యాఖ్యలు చేసినట్టు వివరించారు. గతంలో చైన్నెలో ఆయన నివసించిన ప్రాంతానికి వల్లలార్ నగర్ అని నామకరణం చేశామని, రూ. 10 కోట్లతో వల్లలార్ పేరిట బస్టాండ్‌ను పునరుద్ధరించామన్నారు. తిరువొత్తియూర్ హైవేకి వెళ్లే మార్గాన్ని ‘‘వల్లలార్ హైవే’’ అని పేరు పెట్టి దానిని ప్రారంభించామన్నారు. వల్లలార్ భక్తుల అభ్యర్థన విజయాల కొనసాగింపుగా, ఆయన ఆలోచనలు, జీవిత సూత్రాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాలనే లక్ష్యంతో అంతర్జాతీయ వల్లలార్ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు.
ఏడు ప్రకటనలు..
అంతర్జాతీయ వల్లలార్ సదస్సు వేదికగా సీఎం స్టాలిన్ ఏడు ప్రకటనలు చేశారు. ఈ వేడుకను గుర్తు చేసే విధంగా పాఠశాల ఆవరణలో ఓ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. వడలూరులోని సన్మార్గ శిక్షణ పాఠశాలలో ఇక, సంగీత పాఠాలను కూడా అందించబడుతుందన్నారు. వడలూరులో వల్లలార్ పేరుతో మూలికా వైద్యం ఉద్యానవనం, చైన్నెలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వల్లలార్ పుస్తకం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఛారిటీస్ ప్రెస్ ప్రచురిస్తుందని, ఏటా వల్లలార్ జయంతి రోజు సందర్భంగా మూడు రోజుల పాటుగా ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. మెట్టుకుప్పం, మరుధూరు, కరుంకలిలలో వల్లలార్ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయనున్నామని, కడలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న పార్కుకు వల్లలార్ పేరు పెడుతున్నామని ప్రకటించారు. కుల, మత భేదం లేకుండా సమాజాన్ని నిర్మించాలనే వల్లలార్ గొప్ప కల ద్రావిడ ఉద్యమానికి ప్రాణం అని వ్యాఖ్యలు చేశారు. విభజన శక్తులకు చోటు అన్నది ఇవ్వకుండా, వ్యక్తిత్వం, నైతికత , కరుణతో కూడిన సమాజాన్ని సృష్టిద్దామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, శేఖర్‌బాబు పాల్గొన్నారు.
విద్యా సంస్థలకు మైనారిటీ హోదా
మైనారిటీల సంక్షేమ శాఖ తరపున మైనారిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యాసంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 88 విద్యా సంస్థలకు శాశ్వత మైనారిటీ హోదా కల్పిస్తూ, ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను సీఎం స్టాలిన్ ప్రదానం చేశారు. అలాగే, రూ. 34.98 కోట్ల వ్యయంతో వాణిజ్య పన్ను శాఖ కోసం నిర్మించిన 5 వాణిజ్య పన్ను కార్యాలయ భవనాలు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ. 22.12 కోట్ల వ్యయంతో నిర్మించిన 12 సబ్–రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలు, తిరుప్పూర్ రిజిస్ట్రేషన్ జిల్లాలో పొంగళూరు, తాంబరం రిజిస్ట్రేషన్ జిల్లాలో వండలూర్, కళ్లకురిచ్చి రిజిస్ట్రేషన్ జిల్లాలోని వనపురం పేరిట మూడు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఇక, చైన్నె, రాజీవ్ గాంధీ రోడ్డు – సర్దార్ పటేల్ రోడ్డును అనుసంధానిస్తూ రూ. రూ. 60.68 కోట్ల వ్యయంతో మధ్య కై లాష్ జంక్షన్‌లో నిర్మించిన ఎల్ ఆకార పు వంతెనను సీఎం ప్రారంభించారు. అలాగే షోళింగనల్లూరు ఎల్కాట్ ప్రత్యేక ఆర్థిక మండలిలలో రూ. 84.42 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ విభాగం భవనాలను సీఎం ఆరంభించారు.


