పుదుచ్చేరిలో ప్రధాని మోదీ రోడ్‌షో
ఎన్డీయే విజయమే లక్ష్యంగా ప్రచారం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సాయంత్రం రోడ్‌షో నిర్వహించారు. దారి పొడవునా అభిమానం వెల్లువెత్తింది. ఆయనకు జనం నీరాజనాలు పలికారు. పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షో ప్రచారం నిమిత్తం శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ చైన్నెకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4 గంటలకు పుదుచ్చేరి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి రంగస్వామి, అభ్యర్థులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ముత్యాలపేట మీదుగా రోడ్‌షో ప్రారంభమైంది. అజంతా జంక్షన్‌న్‌కు ప్రధాని చేరుకున్నారు.
అలరించిన సంప్రదాయ కళలు
అజంతా సిగ్నల్ నుంచి నెహ్రూ వీధి వరకు అన్నారోడ్డు పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రధాని రాక సందర్భంగా చిలంబట్టం, ఒయిలట్టం వంటి సంప్రదాయ కళా రూపాలను ప్రదర్శించారు. కళాకారులకు ప్రధాని అభివాదం చేశారు. కిలోమీటర్ పొడవునా ఇరువైపులా నిలబడిన ప్రజలు, పార్టీ శ్రేణులు ప్రధానిపై పూలవర్షం కురిపించారు.
బ్యానర్లతో లబ్ధిదారులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు తమకు అందిన సహాయానికి కృతజ్ఞతగా బ్యానర్లు పట్టుకుని ప్రధానికి స్వాగతం పలికారు. రోడ్‌షో వాహనంలో ప్రధాని మోదీకి ఒకవైపు సీఎం రంగస్వామి, మరోవైపు హోంమంత్రి నమశ్శివాయం ఉండగా, వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం నిలబడ్డారు. కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ వాహనం వెంట నడుచుకుంటూ రావడం విశేషం. 40 నిమిషాల పాటు సాగిన ఈ రోడ్‌షో సాయంత్రం 5.10 గంటలకు కామరాజర్ విగ్రహం వద్ద ముగిసింది. రోడ్‌షో ముగిసిన తర్వాత ప్రధాని మోదీ సీఎం రంగస్వామితో కరచాలనం చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని విమానాశ్రయం నుంచి తిరిగి చైన్నెకి బయలుదేరివెళ్లారు. రాత్రి 7గంటల సమయంలో ఆయన చైన్నెకి చేరుకున్నారు. ఇక్కడి గిండిలోని ఓ స్టార్ హోటల్‌లో బసచేశారు. శనివారం ఉదయం తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. తనకు పోటీ చేసే అవకాశం రాలేదన్న వేదనతో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సీటు ఇవ్వలేదన్న అంసతృప్తితో ఉన్న పుదియ నీతి కట్చి నేత ఏసీ షణ్ముగంతో పీఎం మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం.


