సాక్షి, చైన్నె : రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా సందీప్‌రాయ్ రాథోర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సచివాలయంలో జరిగిన భద్రతాపరమైన సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల వేళ ఇన్‌చార్జ్ డీజీపీ వెంకట్రామన్ స్థానంలో శాంతి భద్రతల విభాగం బాధ్యతలను సందీప్‌రాయ్‌రాథోర్‌కు అప్పగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చైన్నె మెరీనాతీరంలోని డీజీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సచివాలయంలో భద్రతా ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు.
250 కంపెనీల పారా మిలటరీ
రాష్ట్రంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయనున్నారు. నామినేషన్ల పర్వం సోమవారంతో ముగియనుంది. దీంతో ప్రచారాలు విస్తృతం కానున్నాయి. జాతీయ స్థాయి నేతల రాక విస్తృతం కానుంది. దీంతో తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంగా సచివాలయంలో ఎన్నికల అధికారులు, సీఎస్ మురుగానందం, హోంశాఖ కార్యదర్శి ధీరజ్‌కుమార్, డీజీపీ సందీప్‌రాయ్‌రాథోర్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 6వ తేదీన , 13న తమిళనాడులోకి మొత్తం 250 కంపెనీల పారా మిలటరీ బలగాలు రానున్నట్టు తెలిపారు. ఈ బృందాలను ఎక్కడెక్కడ విధుల్లో నియమించాలో అనే విషయాన్ని చర్చించారు. అలాగే, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా, ప్రజలకు ఇబ్బందులు ఎదరురాకుండా, భద్రతాపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. అలాగే, నేతల ప్రచారాలకు భద్రత పెంచాలని ఆదేశించారు.


