సాక్షి, చైన్నె: ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న దృష్ట్యా, ఆశావహుల నుంచి దరఖాస్తుల సమయంలో స్వీకరించిన ఫీజును వెనక్కి ఇవ్వాలన్న నినాదం మక్కల్ నీది మయ్యంలో మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇస్తున్నామని, అయితే, తమ పార్టీ తరఫున ఎవ్వరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు. అదేసమయంలో డీఎంకే తన పార్టీ ఉదయసూర్యుడి చిహ్నంలో పోటీచేయాలని ఒత్తిడి తీసుకు రావడంతోనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసే ఆశతో లక్ష మందికి పైగా మక్కల్ నీది మయ్యం నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా రూ.30వేల నుంచి రూ.50వేల వరకు దరఖాస్తు రుసుము చెల్లించారు. అదేసమయంలో ఎన్నికలల్లో పోటీ చేయనప్పుడు పార్టీని నడపడంలో అర్థం ఏమిటి అన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తుల రూపంలో సేకరించిన రుసుంను వెనక్కి అందించేందుకు కమల్ నిర్ణయించినట్టు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసుకున్న వారికి అందించే విధంగా చర్యలపై మక్కల్ నీది మయ్యం కసరత్తులు చేపట్టిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు.


