ఆ నాలుగింటిపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఆ నాలుగింటిపై దృష్టి

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

న్యూస్‌రీల్‌

సాక్షి, చైన్నె: గెలుపును నిర్ణయించే నాలుగు నియోజకవర్గాలపై తాజాగా అందరి దృష్టి మరలింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ అనాదిగా వస్తున్నది. ఆ నాలుగే చోళవందన్‌, శ్రీపెరుంబుదూర్‌, వేడచందూర్‌, రామనాథపురం. 2021లో ఓడిపోయిన అన్నాడీఎంకే అభ్యర్థులు వి.పి.బి.పరమశివన్‌, మాణిక్యంలను డీఎంకే ఎమ్మెల్యేలు గాంధీ రాజన్‌, వెంకటేశన్‌ మళ్లీ ఎదుర్కోబోతున్నారు. శ్రీపెరుంబుదూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సెల్వపెరుంతొగై మళ్లీ పోటీలో ఉన్నారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాలలో ఏ పార్టీ అయితే గెలుస్తుందే ఆ కూటమిదే అధికారం అన్న సంప్రదాయం మేరకు పందేరాలు మొదలయ్యాయి.

ఆర్మీ వీరులకు సత్కారం

సాక్షి, చైన్నె: దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడే భారత సైనికుల సేవలను గౌరవిస్తూ చైన్నె అంబత్తూరులోని దీపికా బుయిల్‌టెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ నేతృత్వంలో ఘనంగా సత్కార కార్యక్రమం జరిగింది. సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో వివిధ విభాగాలకు చెందిన 30 మంది ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ, కోస్ట్‌గార్డ్‌ అధికారులను సత్కరించారు. జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా కార్యక్రమం జరిగింది. యువతలో సైన్యం గురించి అవగాహన కల్పించడం, దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలను స్మరించుకోవడం ప్రధాన ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించామని ఆ సంస్థ సీఈఓ బి.సభాపతి, ఎండీ ఎస్‌.లత పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ రక్షణ విభాగాలకు చెందిన రిటైర్డ్‌, సర్వీసులో ఉన్న అధికారులను సత్కరించారు. వీరిలో కల్నల్‌ పి. గణేశన్‌, మేజర్‌ మదన్‌కుమార్‌, సుబేదార్‌ డాక్టర్‌ వి.యశుదేవన్‌, హానరరీ కెప్టెన్‌ చంద్రశేఖరన్‌, భారత వైమానికదళానికి చెందిన ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ కృష్ణస్వామి శ్రీధరన్‌, వింగ్‌ కమాండర్‌ కె.ఆర్‌. శ్రీకాంత్‌, భారత కోస్ట్‌ గార్డ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.ఆర్‌.సురేష్‌, భారత నావికాదళం లెఫ్టినెంట్‌ కమాండర్‌ డి.కుళలి విద్య ఉన్నారు.

జైలు నుంచే నామినేషన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు ఎన్నికల్లో భాగంగా హరినాడార్‌ జైలు నుంచి తన నామినేషన్‌ దాఖలు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. తనకు 11 కిలోల బంగారం ఒంటి నిండా ఉన్నట్టు అఫిడవిట్‌లో ప్రకటించారు. గత ఎన్నికల్లో ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి, హెలికాప్టర్‌లో ప్రచారం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన హరినాడార్‌, ఈసారి జైలు నుంచే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆలంకుళం నుంచి పోటీ చేస్తున్న ఆయన, తన వద్ద 11.650 కిలోల బంగారం ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనితోపాటు రూ.1.18 కోట్ల విలువైన 6 వాహనాలు, తనపై ఉన్న 24 కేసుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంక్‌ లోన్‌ మోసం కేసులో పుళల్‌ జైలులో ఉన్న ఆయన, తన మద్దతుదారుల ద్వారా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి ఉండడం వెలుగులోకి వచ్చింది. హరినాడార్‌ దక్షిణ తమిళనాడులో బలమైన సామాజిక వర్గం నేత. ఆయనపై అనేక మోసం కేసులు ఉన్నాయి. తాజాగా రుణం పేరిట జరిగిన మోసం కేసులో కటకటాల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement