గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం | - | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

● నేతలు, అభ్యర్థులతో స్టాలిన్‌ కాన్ఫరెన్స్‌ ● డీఎంకేలోకి అన్నాడీఎంకే, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ శుక్రవారం ఎన్నికల పరిశీలకులు, ఇన్‌చార్జ్‌లు, జిల్లాల కార్యదర్శులు, పార్టీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కొన్ని గంటలపాటు ఈ సమావేశం జరిగింది. సీఎం స్టాలిన్‌ తొలి విడతగా తిరువారూర్‌, తిరుచ్చి, ఈరోడ్‌, కోయంబత్తూరు జిల్లాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మలి విడతగా శుక్రవారం సాయంత్రం తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలో జరిగిన బహిరంగ సభతో దక్షిణ తమిళనాడులో ప్రచారబాట పట్టారు. ముందుగా ఆయన అన్నాఅరివాలయం నుంచి పార్టీ వర్గాలతో సమావేశానికి నిర్ణయించారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిశీలకులు, ఇన్‌చార్జ్‌లు, జిల్లాల కార్యదర్శులు, అభ్యర్థులు పలువురిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కలిశారు.

సీఎం స్టాలిన్‌ కీలక సూచనలు

పార్టీ శ్రేణులకు కఠినమైన, స్పష్టమైన ఆదేశాలు ఈ కాన్ఫరెన్స్‌ ద్వారా జారీ రేశారు. సీటు దక్కలేదని ఎవరూ నిరుత్సాహపడకూడదని, అభ్యర్థుల గెలుపు కోసం ప్రతిఒక్కరూ కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు అవకాశం రాని వారికి మున్ముందు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, యువజన ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌, కోశాధికారి డి.ఆర్‌.బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.నెహ్రూ పాల్గొన్నారు.

డీఎంకేలోకి భారీగా చేరికలు

టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం కీలక నేత, మాజీ ఎంపీ సి.గోపాల్‌ నాయకత్వంలో 80 మందికి పైగా రాష్ట్ర, జిల్లా స్థాయి కీలక నాయకులు అన్నాఅరివాలయానికి చేరుకున్నారు. వీరంతా స్టాలిన్‌ సమక్షంలో డీఎంకేలో చేరారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌.జి.పార్థిబన్‌, ఎం.కోదండపాణి సైతం డీఎంకేలో చేరారు. వీరితోపాటు నెమ్మెలి, షోళింగర్‌, అరక్కోణం, కాట్పాడి నియజకవర్గాలకు చెందిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంతో పాటు అన్నాడీఎంకే నేతలు పలువురు డీఎంకేలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement