భక్తజనసంద్రమైన శైవ క్షేత్రాలు
● రాత్రంతా జాగారం ● మరుమోగిన శివనామ స్మరణ ● ఆధ్యాత్మికతను చాటిన పర్వదినం
శివాలయాలలో భక్తుల పూజలు, అభిషేకాలు
తిరువొత్తియూరు: చైన్నె పాత చాకలిపేటలో శ్రీ కపిల వినాయక దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథస్వామికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కన్యకాపరమేశ్వరి ఆలయంలో రుద్రాభిషేక పూజలు
సాక్షి, చైన్నె: ‘హరహర మహాదేవ.. శంభో శంకర’ అన్న నినాదం రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ఆదివారం మారుమోగాయి. భక్తజనం తరలి రావడంతో శివాలయాలు భక్తి పారవశ్యంలో మునిగాయి. సాయంత్రం నుంచి మహాశివరాత్రి వేడుకలు శివుడి సన్నిధుల్లో మిన్నంటాయి. ప్రత్యేక అభిషేకాది పూజలు జరిగాయి. భక్తిభావం చాటే రీతిలో సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. శివ భక్తులు తమ తమ ఇళ్లల్లో ఉదయాన్నే తల స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షతో శివ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్త్రోత్త్రం, శివ సహస్త్ర నామ పారాయణాలు పటించారు. ఇక సాయం సంధ్య వేళ శివాలయల్లో ఆధ్యాత్మిక వాతావరణం మిన్నంటింది.
వేకువజాము వరకు..
రాష్ట్రంలోని రామేశ్వరం రామనాఽథ స్వామి ఆలయం, కంచిలోని ఏకాంభరేశ్వర ఆలయం, మదురైలోని మీనాక్షి సోమ సుందరేశ్వర ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, చిదంబరం నటరాజ స్వామి ఆలయం, కుట్రాలంలోని కుట్రాలనాథేశ్వరర్ ఆలయం, తిరునాగేశ్వరం ఆలయం, కోయంబత్తూరులోని పొల్లాచ్చి సుందరేశ్వరాలయం, కన్యాకుమారిలోని ధను మలయాన్ ఆలయం, కరూర్ జిల్లాలోని ఏకపురీశ్వరర్ ఆలయం...ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. చైన్నె మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయం, తిరువాన్మీయూరు మరుదీశ్వర ఆలయం, వేళచ్చేరి శ్రీ దండీశ్వర ఆలయం, తిరువేర్కాడు వీరకత్తీశ్వర ఆలయం, పార్క్‌టౌన్‌లోని ఏకాంబరీశ్వరాలయం, వడపళణి వేంగీశ్వరాలయం, సైదాపేట కారనీశ్వరాలయం తదితర శైవ క్షేత్రాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వేకువజాము వరకు ప్రత్యేక పూజలు జరిగాయి.
ఆలయాల సందర్శనకు పరుగు
కన్యాకుమారిలో శివాలయం వైపుగా పరుగో పరుగుతో యాత్ర భక్తి భావంతో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు జరిగింది. ఇక్కడి విలవంగోడు, కల్‌కులం పరిధిలో ప్రసిద్ధి చెందిన 12 శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మహాశివరాత్రిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు శివాలయాలకు భక్తులు పరుగున వెళ్లి దర్శించుకున్నారు. తిరుమలై మహాదేవర్ ఆలయం నుంచి 110 కి.మీ దూరం ఈ పరుగు పయనం యాత్ర జరిగింది. మార్గం మధ్యలోని కాపుకాడు, సెన్నితోట్టం, పల్లన్ విలై, మార్తాండం మీదుగా తొలుత పర్యటించి తీకుచ్చిమహాదేవర్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత అరుమనై, కలియల్ తిరుప్పరపు వీర భద్ర ఆలయం, తిరునంది కరై ఆలయం, కులశేఖరం మార్గం గుండా పయనించి పొన్ మనై మహాదేవర్ ఆలయం, కల్‌కులం నీలకంఠ స్వామి ఆలయం, తిరువిడై కోడు సడయప్పర్ ఆలయం దర్శించుకున్నారు. చివరగా అమరావతి కోలిపోర్ విలై మీదుగా పయనించి మహాదేవర్ ఆలయంలో పూజలు నిర్వహించారు. దారి పొడవున భక్తులకు ప్రజలు, సంఘాలు సొంటి నీళ్లు, వేరుశనగలు, పానకం, మజ్జిగ, గంజి, పండ్లు అందజేస్తారు. వేలాది మంది ఈ యాత్రలో పాల్గొనడంతో దారి పొడవున భక్తి భావంతో శివ నామస్మరణ మిన్నంటింది. ఇక సేలంలో 12 అడుగులతో 10 టన్నులో శివలింగంను తీర్చిదిద్ది పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజలు..
అన్ని శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి విడత, తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండో విడత పూజ, పన్నెండు నుంచి వేకువ జామున మూడు గంటల వరకు మూడో విడత, మూడు నుంచి నాలుగు గంటల వరకు నాలుగో విడత చొప్పున నాలుగు కాల పూజలు భక్తి భావాన్ని నింపాయి. శివ లింగాలకు పూజలు చేసిన భక్తులు శివుడు, పార్వతీ దేవిలను దర్శించుకున్నారు. అన్ని ఆలయాల్లోనూ రాత్రి వాహనాల్లో స్వామి , అమ్మవార్లను అధిష్టించి ఆలయ పుర వీధుల్లో ఊరేగింపులు జరిగాయి. ఆలయ ఆవరణల్లో శివరాత్రి మహత్యాల్ని వివరిస్తూ ఆథ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఆలయాలలో శివుడిని దర్శించుకున్న భక్తులు రాత్రంతా జాగరం చేశారు. పరమశివుని పర్వదినాన్ని ఆథ్యాత్మిక,భక్తి భావంతో భక్తులు గడిపారు. ఆలయాలలో భక్తిని చాటే ప్రవచనాలు, ఆధ్యాత్మిక భావాన్ని నింపే నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఇక, కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసు దేవ్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదియోగి విగ్రహం వద్ద బ్రహ్మాండ వేదికపై శివరాత్రి ఉత్సవ వేడుక కనుల పండువగా జరిగింది. ఈ వేడకకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటూ ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు.
భక్తజనసంద్రమైన శైవ క్షేత్రాలు
భక్తజనసంద్రమైన శైవ క్షేత్రాలు


