టికెట్ నిరాక‌ర‌ణ‌.. మౌనం వీడిన‌ అన్నామ‌లై | Annamalai broke silence over his absence from BJP candidate list | Sakshi
Sakshi News home page

టికెట్ నిరాక‌ర‌ణ‌.. అన్నామ‌లై వివ‌ర‌ణ‌

Apr 4 2026 2:02 PM | Updated on Apr 4 2026 4:34 PM

Annamalai broke silence over his absence from BJP candidate list

చెన్నై: త‌మిళ‌నాడు శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను బీజేపీ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల పేర్ల‌ను వెల్ల‌డించింది. ఈ జాబితాలో బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు కె. అన్నామలై పేరు లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ఒత్తిడి మేర‌కే ఆయ‌న‌ను పోటీకి దూరంగా పెట్టార‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ వ‌దంతుల‌ను అన్నామ‌లై కొట్టిపారేశారు. తానే పోటీ చేయ‌న‌ని అధిష్టానానికి చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు.

త‌నకు టికెట్ నిరాక‌రించ‌లేద‌ని, త‌న‌కు తానుగా పోటీకి దూరంగా ఉన్న‌ట్టు అన్నామలై చెప్పారు. కోయంబత్తూరు నుంచి చెన్నై వచ్చిన ఆయ‌న‌ విమానాశ్రయంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. తన నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికి చాలా ముందే అధికారికంగా లిఖితపూర్వకంగా తెలియజేశానని వెల్ల‌డించారు. ''అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయనని కోర్ కమిటీకి ఎప్పుడో చెప్పేశాను. కాబ‌ట్టి నాకు టికెట్ ఇవ్వ‌లేద‌న్న ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాదు. నాకు నేనుగా పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంటే,  అధిష్టానం టికెట్ ఎలా ఇస్తుంద‌''ని ప్ర‌శ్నించారు.

అధిష్టానం త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేద‌ని మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతోనే తాను స్పష్టత ఇస్తున్నానని అన్నామ‌లై తెలిపారు. త‌న నిర్ణ‌యాన్ని గౌర‌వించినందుకు, ఎన్డీఏ అభ్య‌ర్థుల ప్ర‌చారం చేసేలా అనుమ‌తి ఇచ్చినందుకు పార్టీ నాయ‌క‌త్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా, గెలిచే స‌త్తా నాయ‌కుల‌నే అభ్య‌ర్థులుగా ఎంపిక చేసింద‌ని ఆయ‌న ఎక్స్‌లో పేర్కొన్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు డీఎంకే సంకీర్ణ ప్ర‌భుత్వ మోసాల‌తో విసిగిపోయార‌ని, ఈసారి ఎన్డీఏకు ప‌ట్టం క‌డ‌తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

చ‌ద‌వండి: త‌మిళ‌నాడు ఎన్నిక‌ల బ‌రిలో తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్‌

అన్నామ‌లై అలిగారా?
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నామ‌లై హాట్‌టాపిక్‌గా మారారు. అన్నాడీఎంకేతో సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో ఆయ‌న గుర్రుగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కోయంబ‌త్తూరులోని కీల‌క స్థానాల‌ను అన్నాడీఎంకే పార్టికి కేటాయించ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోయార‌ని స‌మాచారం. ఇదే విష‌యంపై పార్టీ కేంద్ర నాయ‌క‌త్వానికి లేఖ కూడా రాసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. సీట్ల పంపిణీలో అన్నాడీఎంకే అగ్ర‌నేత ప‌ళ‌నిస్వామి పెత్త‌నం ఆయ‌నను మ‌రింత క్షోభ‌కు గురిచేసింద‌ని అన్నామ‌లై స‌న్నిహితులు అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల్లో పోటీకి ఆయ‌న‌కు దూరంగా ఉన్నార‌న్న గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. లోపల ఎలా ఉన్నా, పైకి మాత్రం అలాంటిదేమి లేద‌ని అన్నామ‌లై చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement