పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు 

Banjarahills: Arif Moinuddin Left Dogs on Police - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: దాడి కేసులో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైకి పెంపుడు కుక్కలను వదిలి భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తిని బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని బంజారా గ్రీన్‌ కాలనీలో నివసించే సయ్యద్‌ అహ్మద్‌ హుస్సేన్‌ జాఫ్రీ 2013లో రౌడీషీటర్‌ ఆరిఫ్‌ మోయినుద్దీన్‌కు తన ఇంటిని కిరాయికి ఇచ్చాడు.

జాఫ్రీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆరిఫ్‌ ఆ ఇంటికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నించగా కోర్టులో జాఫ్రీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. రెండేళ్ల క్రితం ఆరీఫ్‌ కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇంటిని ఖాళీ చేసినా నకిలీ పత్రాలతో ఎలాగైనా కబ్జా చేయాలని పథకం వేశాడు. మంగళవారం అర్ధరాత్రి తన స్నేహితుడు రషీద్‌ బిన్‌ సయీద్‌ హందీతో పాటు మరో 15 మందితో కలిసి జాఫ్రీపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి పరారయ్యారు.

చదవండి: (హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు)

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 86లోని శాయా కసీటా విల్లాలో ఉంటున్న ఆరీఫ్‌ను అరెస్టు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్‌ డీఐ హఫీజుద్దీన్, ఎస్‌ఐ కె. ఉదయ్, కానిస్టేబుల్‌ డి.శేఖర్‌ తదితరులు వెళ్లారు.  ఇంట్లో దాక్కున్న ఆరిఫ్‌ పోలీసులను అడ్డుకునేందుకు పెంపుడు కుక్కలను వారిపైకి వదిలాడు. వాటి బారి నుంచి తప్పించుకున్న పోలీసులు ఇంటి వెనక డోరు పగలగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో హందీతో పాటు మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం గాలింపు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top