కోతిని తప్పించబోయి ఆటో బోల్తా

The auto overturned while avoiding the monkey - Sakshi

ఇద్దరు కూలీలు మృతి.. 11 మందికి గాయాలు   

వేములవాడ రూరల్‌: వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వేములవాడ అర్బన్‌ మండలం చింతల్‌ఠాణా మిడ్‌మానేరు ముంపు గ్రామం కావడంతో ఇక్కడ పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ మహిళా కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో చందుర్తి మండలం మర్రిగడ్డకు వరినాట్ల పనులకు వెళ్లారు.

పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ రూరల్‌ మండలం నాగాయపల్లి వద్ద ఆటోకు ఎదురుగా కోతి వచ్చింది. డ్రైవర్‌ కోతిని తప్పించబోగా ఆటోకింద ఇరుక్కోవడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో జాతరకొండ మల్లవ్వ (51) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ కుర్ర బాలవ్వ (65) కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మిగతా 11 మంది కూలీలు వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ రూరల్‌ ఎస్సై మారుతి కేసు నమోదుచేసి, మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top