ప్రాధేయ పడినా వినిపించుకోలేదు.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయాధికారి

Agriculture Officer Was Caught In The ACB Trap The Incident Took Place In Miryalaguda - Sakshi

రైతు బీమా కోసం లంచం అడిగిన వైనం

ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

రూ.12 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు

మిర్యాలగూడ అర్బన్‌: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న ఓ రైతు కుటుంబం నుంచి లంచం తీసుకుంటూ వ్యవసాయ అధికారి అడ్డంగా దొరికిపోయిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ మండలం కొత్తగూడం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అన్విస్‌రెడ్డి(23) ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వ్యవసాయ భూమి అతడి పేరుపై ఉండటంతో రైతు బీమాకు అర్హులు అవుతారని, బీమా సొమ్ముతోనైనా ఆ కుటుంబం కొంత ఊరట చెందుతుందనే ఉద్దేశంతో మృతుడి మేనమామ గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 16న బీమా పథకానికి కావలసిన అన్ని రకాల పత్రాలను తీసుకుని వ్యవసాయ అధికారి బొలి శెట్టి శ్రీనివాస్‌ను కలిశాడు.

బీమా సొమ్ము రావాలంటే రూ.15వేలు ఇవ్వాలని.. డబ్బులు ఇస్తేనే సదరు ఫైల్‌ కదులుతుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనలతో మరో­మా­రు సదరు అధికారితో మాట్లాడారు. చివరకు రూ.12వేలు ఇచ్చేంకు ఒప్పదం కుర్చుకున్నారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం శుక్రవారం పట్టంలోని నల్లగొండ రోడ్డు రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనం సమీపంలో బాధితుడు గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్‌ రూ.12వేలు తీసుకుంటుండగా ఏబీసీ డీఎస్పీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో అధికారులు శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ను వ్యవసాయ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రామ్మూర్తి, నగేష్, శివకువర్‌ ఉన్నారు.

ప్రాధేయ పడినా వినిపించుకోలేదు
మా మేనళ్లుడు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమా కోసం ఏఓ శ్రీనివాస్‌ను కలిశాం. ఆయన రూ.15వేలు ఇస్తేనే ఫైల్‌ కదులుందని, లేకుంటే 4వేల పెండింగ్‌ ఫైళ్లలో నీ ఫైలు కూడా కలుస్తుందని చెప్పాడు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాం. పేద కుటుంబ కావండంతో.. బీమా సొమ్ము వస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఆశించాం. కానీ, ఇక్కడి వచ్చాక వ్యవసాయ అధికారులు లంచం అడిగి ఇబ్బందిపెట్టారు. 
– బాదితుడు గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top