తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు.
కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.
అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.
తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్‌గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్‌లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్‌లైన్ ఎగ్జామ్ రాస్తూనే..


