ట్రేడింగ్‌ పేరుతో రూ.150 కోట్లు స్వాహా | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌ పేరుతో రూ.150 కోట్లు స్వాహా

Published Wed, Nov 16 2022 2:03 AM

150 Crore Scam Name Of Trading - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక యాప్‌ ద్వారా ట్రేడింగ్‌లో పెట్టుబడులు.. రోజూ భారీ లాభాలంటూ ముక్తిరాజ్‌ అనే పాత నేరగాడు అనేక మందికి ఎర వేశాడు. రూ.150 కోట్ల మేర స్వాహా చేశాడు. గతంలో జైల్లో ఉన్నప్పుడు ఇతడు వేసిన ఈ స్కెచ్‌కు జైలు అధికారులూ సహకరించారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముక్తిరాజ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వందల మంది బాధితులు మంగళవారం హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఖనిజాలపై ట్రేడింగ్‌...
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. రాంనగర్‌కు చెంతిన ముక్తిరాజ్‌ గతంలో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కేసులో అరెస్టై చర్లపల్లి జైలుకు వెళ్లాడు. రియల్‌ ఎస్టేట్‌తోపాటు ఖనిజాలపై ట్రేడింగ్‌ చేస్తానంటూ జైలు సిబ్బందిని నమ్మించాడు. బయటకు వచ్చిన ముక్తిరాజ్‌ హబ్సిగూడలో రియల్‌ ఎస్టేట్‌ పేరుతో కార్యాలయం తెరిచాడు. ఇది సక్సెస్‌ కాకపోవడంతో ట్రేడింగ్‌ వైపు మొగ్గాడు. ఆ వెంటనే తన కార్యాలయం పేరును మల్టీ జెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చేశాడు.

ప్రత్యేకంగా ఒక యాప్‌ తయారు చేయించి, అందులో బంగారం, వెండి, రాగి, ముడిచమురు, గ్యాస్, అల్యూమినియం, సీసం, నికెల్, మిథనాల్‌.. ఇలా అనేక వాటిపై ట్రేడింగ్‌ చేసేలా అవకాశం ఇచ్చాడు. రోజుకు 3 శాతం లాభం ఇస్తామని, ఇందులో ఒక శాతం జీఎస్టీ, సర్వీస్‌ చార్జీ తప్ప మిగిలింది మొత్తం తక్షణం ఇచ్చేస్తానంటూ నమ్మబలికాడు. ఈ ఏడాది జూన్‌లో ఈ స్కీమ్‌ మొదలుపెట్టి రెండు నెలల్లోనే వందలాది మందిని ఆకర్షించాడు. గొలుసు కట్టు విధానంలో సాగే ఈ స్కీమ్‌లో మొదట చేరిన వాళ్లు తమ కింద సభ్యులను చేరుస్తూపోయారు. ఒక్కొక్కరు 11 మందిని చేర్చగా వీరికి గరిష్టంగా 9 శాతం వరకు కమీషన్‌ చెల్లించాడు. దీనిపై ప్రచారం కావడంతో వేల మంది చేరారు. 

భారీగా లాభాలు కనిపించేలా...
కస్టమర్లు కంపెనీ ఖాతాల్లో డబ్బు డిపాజిట్‌ చేశాక ముక్తిరాజ్‌ యాప్‌నకు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చాడు. ఆ యాప్‌లో వారి పెట్టుబడి, లాభాలు కన్పించేలా చేశాడు. కొందరు బాధితులు బృందాలుగా ఏర్పడి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ నెల 10 వరకు లాభాలు ఇస్తూ వచ్చిన ముక్తిరాజు ఆపై గోల్‌మాల్‌ మొదలుపెట్టాడు.

దీంతో అనుమానం వచ్చిన అనేక మంది డబ్బు విత్‌ డ్రా చేయడం ప్రారంభించగా, ముక్తిరాజు విత్‌ డ్రా ఆప్షన్స్‌ బ్లాక్‌ చేశాడు. అనేక మంది బాధితులు కార్యాలయానికి, ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో వారు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ దందాలో ముక్తిరాజ్‌ 10 మంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో బాగిరెడ్డి, సురేష్, భాస్కర్, సతీష్‌ కీలకమని బాధితులు చెప్తున్నారు.

నాలుగు బ్యాంక్‌ ఖాతాలను నిర్వహించిన ముక్తిరాజు ఇటీవల వాటి నుంచి రూ. 100 కోట్ల వరకు దారి మళ్లించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇతడి బారినపడిన వారిలో జైలు సిబ్బంది సైతం ఉండటం గమనార్హం. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీసీఎస్‌ అడ్మిన్‌ ఏసీపీ పూర్ణచందర్‌ బాధితులకు చెప్పారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement