నేడు జిల్లాలో ‘పుర’పాలకవర్గాల కొలువు ఓ మేయర్.. ముగ్గురు చైర్‌పర్సన్ల ప్రమాణం ‘ఉప’ కుర్చీకి పోటా పోటీ.. మిత్రపక్షానికి టోపీ చిత్తూరు డెప్యూటీ మేయర్‌గా గోపీనాథ్ మూడు మునిసిపాలిటీల్లో కొలిక్కిరాని వైస్ చైర్మన్లు
పీఠాధ్యక్షులే కీలకం
1986 వరకు మేయర్–చైర్‌పర్సన్లను పరోక్ష పద్ధతిలో కౌన్సిలర్లు–కార్పొరేటర్లు ఎన్నుకునేవాళ్లు. 1986–2005 వరకు మేయర్– చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 2005 నుంచి మళ్లీ పరోక్ష ఎన్నికలు నిర్వహించారు. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో చిత్తూరు మేయర్‌గా కటారి హేమలత, కుప్పం చైర్మన్‌గా రాజకుమార్ (టీడీపీ), పలమనేరు చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి (టీడీపీ) గెలుపొందారు. నగరి చైర్మన్‌గా శ్రీనివాసన్ (టీడీపీ) ఏకగ్రీవంగా గెలిచినట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. పాలకవర్గంలో అంశాలు ఆమోదం పొందడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో పీఠాధ్యక్షులే కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్–అఫిషియో సభ్యులుగా కొనసాగుతారు. అన్ని చోట్ల కూడా పాలకవర్గానికి పూర్తిస్థాయి కోరం ఉండడం ఉపసమనం ఇచ్చే విషయం.
సాక్షి, చిత్తూరు: 250 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లాలోని ఓ కార్పొరేషన్ మేయర్‌తో పాటు మూడు మునిసిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ ఏడాది మార్చి 17న మునిసిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగియడం.. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో పరిపాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికలు–ఫలితాల్లో గెలుపొందిన నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే సమయంలో ‘ఉప’ కుర్చీలపై సందిగ్దత కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈ కుర్చీకి సైతం రేట్లు చెల్లించడానికి తమ్ముళ్లు సిద్ధమవడం గమనార్హం.
తేలని ‘ఉప’ పీఠాలు
జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల పాలకవర్గాల్లో ఉపాధ్యక్షులు ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇందులో అధిష్టానం కూడా ఆర్థికంగా ఎవరు బలవంతులు..? పార్టీకి ఎంత సమర్పించుకుంటారు..? అనే విషయాలపై నిర్ణయం తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలకే పగ్గాలు అప్పగించింది. చిత్తూరు కార్పొరేషన్‌లో ఉప–మేయర్ కోసం బాబు సామాజిక వర్గానికి చెందిన ఓ టీడీపీ కార్పొరేటర్ ఏకంగా రూ.1.5 కోట్లు ఇవ్వడానికి బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గోపీనాథ్‌ను ఉపమేయర్ పదవి వరించినట్టు ప్రచారం జరుగుతోంది. పలమనేరులో మునిసిపాలిటీలో టీడీపీ నుంచి మైనారిటీ కోటాగా తనకు వైస్‌చైర్మన్ ఇవ్వాలని ఖాజా పట్టుపడుతుంటే.. జనసేన తరఫున మురాద్, పూల చైతన్య తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధికి కలెక్షన్ ఏజెంటుగా ఉన్న వ్యక్తికే కుర్చీ ఖాయమనే ప్రచారం సాగుతోంది. నగరిలో కేజే కుటుంబం నుంచి విజయ్ వైస్ చైర్మన్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దాదాపు రూ.30 లక్షలు ఓ నేతకు ఇచ్చుకునేందుకు సైతం వెనకాడటంలేదు. ఇదే సమయంలో ఎస్సీ సామాజికవర్గం గతంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ సతీమణి లత ఉప కుర్చీ ఆశిస్తున్నారు. కుప్పంలో చైర్‌పర్సన్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. బాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి వైస్ చైర్మన్ తీసుకుని మునిసిపాలిటీ తన గుప్పెట్లో ఉండాలని భావిస్తుంటే.. మైనారిటీ విభాగంలో తమకు అవకాశం ఇవ్వాలని సుల్తానా, ఆపిలా డిమాండ్ చేస్తున్నారు.
మళ్లీ మిత్ర ద్రోహం
జిల్లాలో ఏ ఒక్క చైర్‌పర్సన్ సీటు కూడా కూటమిలో భాగమై మిత్రపక్షంగా ఉన్న జనసేన, బీజేపీకు ఇవ్వలేదు. దీంతో కనీసం మునిసిపాలిటీల్లో వైస్–చైర్మన్ కుర్చీనైనా కట్టబెడుతారని గంపెడాశలతో ఉన్న మిత్రపక్ష నేతలకు ఈ సారి కూడా టీడీపీ నేతలు మొండిచేయి చూపించారు. వచ్చినంత వరకు కాసులు రాల్చుకోవడమే లక్ష్యంగా కుర్చీలకు ఖరీదు కడుతున్నారనే విమర్శలు తప్పలేదు.


