నరకప్రాయంగా పల్లె రోడ్లు
రొంపిచెర్ల మండలం, పెద్దమల్లెల
పంచాయతీలో తోటిహరిజనవాడలో అధ్వాన్నంగా రోడ్డు
బంగారుపాళ్యం మండలం
తుంబకుప్పం వద్ద గుంతల రోడ్డు
నడవాలంటే నరకమే
పచ్చికాపల్లం–మాంబేడు వెళ్లే తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు నిండా గుంతలు, కంకర తేలడంతో నడవాలన్నా నరకమే. అరికాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్నాయి. ప్రభుత్వం, అధికారులు స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలి.
– రోసిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మాంబేడు
అన్ని గుంతల రోడ్లే
జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అధ్వాన్నమైన రహదారులే గతి. పలు మార్గాల్లో తారు కొట్టుకుపోయి ఎక్కడ చూసినా కంకర, గచ్చు తేలిపోయింది. వర్షాలు పడ్డప్పుడు పరిస్థితి వర్ణనాతీతం. ఎక్కడ గుంత ఉందో కూడ కనపడదు.
– నాదముని, ముత్తూకూరు గ్రామం
చిత్తూరు కార్పొరేషన్ : గ్రామీణాభివృద్ధికి పట్టుగొమ్మలైన పల్లె రహదారులు నరకప్రాయంగా మారాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, మారుమూల మండలాల్లో గ్రామీణ రోడ్ల దుస్థితిపై స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘అడుగుకో గొయ్యి, గజానికో గుంత’ అన్న చందంగా మారిపోయాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నరక దారుల్లో రాకపోకలు సాగించలేక ప్రయాణికులు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారుల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్.
మంజూరు ఘనం.. అమలు శూన్యం
జిల్లాలో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో వందల కోట్ల రూపాయల విలువైన రోడ్డు నిర్మాణ పనులు మంజూరైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేస్తున్నారు.
పనులకు బ్రేక్
2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.93 కోట్లతో 1,607 పనులు (215 కి.మీ.) మంజూరు కాగా, రూ.75 కోట్ల వ్యయంతో 1,538 పనులు (200 కి.మీ.) పూర్తయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.211 కోట్లతో 1,876 పనులు (424 కి.మీ.) మంజూరైనప్పటికీ, నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో ఇప్పటివరకు 662 పనులు (175 కి.మీ.) మాత్రమే రూ.88 కోట్లతో పూర్తయ్యాయి.
నత్తనడకన పనులు
కేంద్ర ప్రభుత్వ పథకంలో రూ.27.50 కోట్లతో 30.16 కి.మీ మేర 4 ప్రధాన రోడ్డు పనులు మంజూరయ్యాయి. వీటిలో రూ.13 కోట్ల వ్యయంతో 3 పనులు (14.96 కి.మీ.) పూర్తి కాగా, కీలకమైన మరో 15.20 కి.మీ మేర పనులు ఇంకా పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి.
ప్లెయిన్, ఎస్‌ఈపీ పథకాల్లోనూ అదే తీరు
రూ.21.57 కోట్లతో 76.72 కి.మీ రోడ్ల నిర్మాణానికి (62 పనులు) నిధులు కేటాయించగా, రూ.13.76 కోట్లతో 41.14 కి.మీ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 35.31 కి.మీ మేర పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని దుస్థితి.
ఎస్‌ఏఎస్‌సీఐ పథకం అట్టర్ ప్లాప్
జిల్లాలో 155.94 కి.మీ. రోడ్ల నిర్మాణంకు రూ.73.67 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.5.70 కోట్లతో 2 కి.మీ. రోడ్డు మాత్రమే నిర్మించారు. మిగిలిన 153.94 కి.మీ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి.
గ్రామాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
రహదారులు అధ్వాన్నంగా మారడంతో రైతులు తాము పండించిన కూరగాయలు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు తరలించలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యవసర సమయాల్లో గ్రామాల్లోకి 108 అంబులెన్స్‌లు, పాఠశాల బస్సులు రావడానికి సైతం డ్రైవర్లు వెనకడుగు వేస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
జిల్లా గ్రామీణ రోడ్ల పురోగతి గణాంకాలు
పథకం పేరు మంజూరు చేసిన నిధులు పెండింగ్ పనులు ప్రస్తుత పరిస్థితి
ఎంజీఎన్‌ఆర్‌జీఎస్ (2025–26) రూ.211 కోట్లు (1876 పనులు, 424 కి.మీ) సగానికిపైగా పనులు పెండింగ్
పీఎంజీఎస్‌వై–3 రూ.27.50 కోట్లు ( 4 రోడ్లు, 30.16 కి.మీ) మరో 15.20 కి.మీ పనులు పెండింగ్
ప్లెయిన్, ఎస్‌ఈపీ రూ.21.57 కోట్లు (62 పనులు, 76.72 కి.మీ). ఇంకా 35.31 కి.మీ పనులు అసంపూర్తి
ఎస్‌ఏఎస్‌సీఐ రూ.73.67 కోట్లు (155.94 కి.మీ) 153.94 కి.మీ పనులు నిలిచిపోయాయి
పట్టించుకునే నాథుడేరీ?
గత రెండున్నరేళ్లుగా కనీస మరమ్మతులు (ప్యాచ్ వర్కులు) సైతం చేపట్టలేదు. జిల్లాలో ని వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటనలతో హోరెత్తిస్తున్న చంద్రబాబు సర్కారు, గ్రామీణ మౌలిక వసతుల కల్పనను పూర్తిగా గాలికొదిలేసింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌న్‌కల్యాణ్ తన శాఖ పరిధిలోని గ్రామీణ రహదారుల దుస్థితిపై కనీసం సమీక్ష సైతం నిర్వహించడంలేదు. గుంతల రోడ్ల కారణంగా నిత్యం ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి, ఆటోలు బోల్తా పడి పలువురు క్షతగాత్రులవుతున్నారు. ప్రాణాలు పోకముందే ప్రభుత్వం కళ్లు తెరవాలని పల్లె ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


