తొట్టంబేడు.. కట్టబెట్టారు చూడు | - | Sakshi
Sakshi News home page

తొట్టంబేడు.. కట్టబెట్టారు చూడు

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మెజారిటీ వస్తే రీకౌంటింగ్‌

వైఎస్సార్‌సీపీ నేతలు అడిగితే డోంట్‌ కేర్‌

కౌంటింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేసి ఓట్ల కట్టల మార్పు

చాలాచోట్ల కౌంటింగ్‌ ప్రారంభించినా రౌండ్‌ల వారీగా ప్రకటించని ఫలితాలు

ఓటమి భయంతో బ్యాలెట్‌ బాక్సులు పడేసినా పరిగణనలోకి తీసుకోని

యంత్రాంగం

కూటమి నేతల కుట్రలతో గెలిచిన స్థానాలే ఎక్కువ

టీడీపీ నేతలు, అధికారులు మిలాకత్‌

తొట్టంబేడు మండల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి మూడు రౌండ్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉన్నం వాసుదేవనాయుడు ఆధిక్యంలో ఉన్నారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులకు పలు మార్లు ఫోన్లు వచ్చాయి. ఫోన్‌ వచ్చిన సమయంలో దూరంగా వెళ్లి మాట్లాడి రావడం కనిపించిందని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు చెబుతున్నారు. ఆ తరువాత టీడీపీ ఏజెంట్‌ ఒకరు రెండు ఓట్ల కట్టలను బయటపడేశాడు. మరో వైపు అరగంట పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ ఉన్నా వినియోగించ లేదు. ఈ రెండు పరిణామాల తరువాత టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు. అదేవిధంగా తొట్టంబేడు మండలం, తాటిపర్తి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి 3 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రీ కౌంటింగ్‌కి డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో 35 చెల్లనివిగా చూపించడంపై ఆ పార్టీ అభ్యర్థి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, తిరుపతి: స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు ‘బ్యాలెట్‌’ను అడుగడుగునా అవమానించారు. ప్రలోభాలు, ఒత్తిళ్లకు పూర్తిగా లొంగిపోయారు. రీకౌంటింగ్‌ పేరుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కూటమి నేతలకు రాసిచ్చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు దొంగలు, అధికారులు, పోలీసులు కుమ్ముకై ్కపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలకు విలువ లేకుండా చేశారు. ఓటర్లకు సైతం ఓటు వేయాలనే ఆసక్తి లేకుండా చేశారు. కౌంటింగ్‌ సమయంలోనూ ఎన్నికల అధికారులు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కూటమి నేతలకు రాసిచ్చేశారు. అలా రాసిచ్చేసిన వాటిలో మచ్చుకు కొన్ని..

కేవీబీపురం జెడ్పీటీసీ ఎన్నికల ఫలితం తారుమారు

సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బత్తల సుజాత చివరి రౌండ్‌ పూర్తయ్యే సరికి 380 ఓట్ల ఆధిక్యం సాధించారు. టీడీపీ నేతల ఒత్తిడితో ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించకుండా ఆపేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఐదు పర్యాయాలు రీ–కౌంటింగ్‌ నిర్వహించారు. అర్ధరాత్రి వరకు పోలీసులను భారీగా మోహరించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను తరిమేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మెజారిటీ సాధించిన ఓట్లన్నీ చెల్లనవిగా చూపించి.. 301 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు ఆర్వో ప్రకటించడం తీవ్ర దుమారాన్ని రేపింది.

ఆ అరగంటలో ఏం జరిగింది

శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట జెడ్పీటీసీ కౌంటింగ్‌ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం ప్రతి రౌండ్‌కూ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. అయితే మూడో రౌండ్‌ ప్రారంభమైనా.. రేణిగుంట జెడ్పీటీసీ ఫలితాలను ప్రకటించకుండా గోప్యంగా ఉంచారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏజెంట్‌ వెళ్లి ఎన్నికల అధికారులను నిలదీయడంతో రెండు రౌండ్ల ఫలితాలను ప్రకటించారు. ఈ రెండు రౌండ్లలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముందంజలో ఉన్నారు. కూటమి నేతల ఒత్తిడితో మూడో రౌండ్‌ ఫలితాలను ప్రకటించలేదు. సాయంత్రం కలెక్టర్‌, ఎస్పీ వచ్చి వెళ్లిన తరువాత అర్ధ గంట పాటు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. జనరేటర్‌ ఉన్నా వినియోగించలేదు. ఆ సమయంలో ఓట్ల కట్టలను మార్చేసి బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.

ధర్నా చేస్తేనే డిక్లరేషనా?

పెనుమూరు జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నిరీషారెడ్డి విజయం సాధించారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రం నుంచి అధికారులు గెంటేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో ఎన్నికల అధికారి డిక్లరేషన్‌ ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కౌంటింగ్‌ కేంద్రం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ పరిణామాన్ని జీర్ణియించుకోలేని టీడీపీ నేతలు, ఎన్నికల అధికారులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జ్‌ చేయించారు. ఎన్నికల అధికారులపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవ్వటంతో సోమవారం నిరీషారెడ్డి విజయం సాధించినట్లు డిక్లరేషన్‌ ఇచ్చారు.

కౌంటింగ్‌ కేంద్రంలో కుమ్మక్కు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల్లో అధికార పార్టీ నేతలు, ఎన్నికల అధికారులు, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టీడీపీ అభ్యర్థి, ఏజెంట్ల వద్ద మొబైల్‌ తెచ్చుకునేందుకు అనుమతించారు. కౌంటింగ్‌ కేంద్రంలో దర్జాగా ఫోన్లలో మాట్లాడుకున్నా పట్టించుకోలేదు. మరో వైపు ఎన్నికల అధికారులకు తరచూ ఫోన్‌ కాల్స్‌ రావడం కనిపించింది. ఫోన్‌ వచ్చిన ప్రతిసారీ ఎన్నికల అధికారులు దూరంగా వెళ్లి మాట్లాడి తిరిగి కౌంటింగ్‌ వద్దకు రావడం వెనుక పెద్ద కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు ఆరోపిస్తున్నారు.

రీ కౌంటింగ్‌ పేరుతో రాసిచ్చేశారు!

60 ఓట్లు మెజారిటీ వచ్చినా..

చిత్తూరు మండలం, దిగువ మాసపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థి 60 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే టీడీపీ నేతలు దౌర్జన్యంగా రీకౌంటింగ్‌ చేయించి, సదరు అభ్యర్థికి వచ్చిన ఓట్లలో 100కు పైగా చెల్లనవిగా చూపించారు. టీడీపీ అభ్యర్థి 55 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన చాలా ఓట్లను చెల్లనివిగా చూపించారు.

ఉన్న ఓట్లకంటే 26 అధికంగా ఎలా?

ఐరాల మండలం, గుండ్లపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఎన్నికల అధికారులు బరితెగించారు. గుండ్లపల్లి గ్రామం పోలింగ్‌ బూత్‌ నం.6/18కు సంబంధించి పోలింగ్‌ రోజు ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చిన అధికారిక డిక్లరేషన్‌ ఫారంలో మొత్తం పోలైన ఓట్లు 442 ఉంది. కౌంటింగ్‌ రోజు జెడ్పీటీసీ ఓట్లు 442 ఉండగా, ఎంపీటీసీకి మాత్రం 465 ఓట్లు ప్రత్యక్షమయ్యాయి. 26 ఓట్లు అదనంగా రావడంతో ఏజెంట్‌ కొణతం చంద్రశేఖర్‌ అభ్యంతరం తెలిపారు. గంటకుపైగా కౌంటింగ్‌ నిలిపివేశారు. ఎన్నిక అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అదే సమయంలో కలెక్టర్‌, ఎస్పీ తుషార్‌డూడి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చివరకు టీడీపీ అభ్యర్థే విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఎన్నికల అధికారా.. టీడీపీ ఏజెంటా?

గంగాధరనెల్లూరు జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శోభకి 260 ఓట్లు మెజారిటీ వచ్చాయి. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి సీకే శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఏజెంట్లు బయటకు వెళ్లిపోవాలంటూ.. దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. పోలీసుల సహకారంతో బయటకు గెంటివేయించారు. 10 నిముషాల తరువాత టీడీపీ అభ్యర్థి యేసు మణి 304 ఓట్లతో విజయం సాధించినట్లు డిక్లరేషన్‌ ఇచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement