ఆయువు తీసేలా వాయువు | - | Sakshi
Sakshi News home page

ఆయువు తీసేలా వాయువు

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

● జిల్లాలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యం ● దీపావళి తర్వాత ఏక్యూఐ ఏకంగా 130 పెరుగుదల ● తాజాగా 201కి చేరిన గాలి నాణ్యతా సూచికలు ● ఏమరపాటు వహిస్తే.. ఢిల్లీతో పోటీపడాల్సిందే! ● పలు చోట్ల నమోదైన గరిష్ట పాయింట్లు

ప్రాణం పోసే వాయువు.. ఆయువు తీసేలా తయారైంది. మానవ తప్పిదాలతో వాతావరణం పూర్తిగా కలుషితమవుతోంది. ప్రధానంగా దీపావళి

పండుగ తర్వాత వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తగు జాగ్రత్తలు తీసుకోకుంటే మరింత విషతుల్యంగా మారే దుస్థితి దాపురించింది.

సాక్షి, చిత్తూరు : ఇప్పటి వరకు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన కొండలు, జలపాతాలు, సెలయేర్లకు నెలవుగా ఉన్న చిత్తూరు జిల్లా వాయు కాలుష్య పరిధిని దాటేసింది. రెండు రోజులుగా జిల్లాలో గాలి నాణ్యత సూచికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు నగరంలో ఏక్యూఐ (గాలి నాణ్యత సూచిక) 201 పాయింట్లుగా నమోదైంది. నగరి, పలమనేరు ప్రాంతాల్లోనూ ఈ సూచికలు భారీగా కాలుష్య స్థాయిను నమోదు చేశాయి.

పొగ చాటున ముప్పు

జిల్లాలో దీపావళికి ముందు రోజు నగరిలో ఏక్యూఐ 84 పాయింట్లు ఉంటే, పండుగ రోజున రాత్రి 11 గంటలకు ఏకంగా ఇది 1,124 పాయింట్లకు చేరుకుంది. చిత్తూరులో ఈనెల 7వ తేదీన 56 ఉన్న గాలి నాణ్యత సూచిక.. పండుగ రోజు రాత్రి 12 గంటలకు 830, సోమవారం 161 పాయింట్లకు చేరుకుంది. ఇక పలమనేరులో ఈనెల 7న 70, 8వ తేదీన 299, 9వ తేదీన 123 పాయింట్లకు చేరుకుంది. ఈ రీడింగులు మనం వాహనాలు వాడే సమయం, పొగ వెలువడే సమయం ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే ఇవి గాల్లో అలాగే ఉండిపోవు. కానీ, సగటున ఏక్యూఐ 50 పాయింట్లకు లోపు ఉంటే ఆరోగ్యకరం. 50–100లోపు ఉంటే సంతృప్తికరం. 100– 200 ఉంటే శ్వాస తీసుకోవడంతో కొద్దిగా ఇబ్బందులు, గొంతులో మంట మొదలవుతుంది. 300 దాటితే ప్రమాదకర పరిస్థితి. ఇది కడుపులో మంట, వాంతులు, కళ్లు మంట, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. కానీ, ఇక్కడ చూస్తున్న పాయింట్లు చాలా వరకు 300లకు దాటిపోయాయి. ఇవి అర్ధరాత్రి నమోదు కావడం, ఆ సమయంలో పెద్దగా ఎవరూ బయట తిగరకపోవడంతో ప్రమాదం లేదు. ఇదే సమయంలో సగటున మాత్రం 100 పాయింట్లు దాటడంతో మనం పీల్చే వాయువు కలుషితమైందనేది సుస్పష్టం.

జిల్లాలో పెరుగుతున్న వాయు కాలుష్యం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సగటున ఓ వ్యక్తి రోజుకు నాలుగు సిగరెట్లు తాగడంతో సమానం. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులతో పాటు మెదడు కణాలు ప్రభావితమవుతాయి. దీని ఫలితం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి కారణం లేకుండా చిరాకు పడడం, కిలో మీటరు దూరం నడిస్తే ఆయాసం రావడం జరుగుతోంది. ఇపుడు నమోదవుతున్న ఏక్యూఐ పాయింట్లను దీపావళి పండుగపైకి తోసేయడానికి వీల్లేదు. వాహనాల నుంచి వెలువడే పొగలోని కార్భన్‌మోనాకై ్సడ్‌.. బాణసంచా పొగకంటే వెయ్యి రెట్లు ప్రమాదకరం. స్వచ్ఛ గాలికోసం పట్టణాలు, నగరాల్లోని ప్రధాన కూడళ్లలో కార్భన్‌ డయాకై ్సడ్‌ను తీసుకుని ఎక్కువగా ఆక్సిజన్‌ విడుదల చేసే మొక్కలతో పచ్చదనం పెంచుతూ మినీ గార్డెన్లను ఏర్పాటు చేయాలి. ఇంధనాలతో నడిచే వాహనాలను పక్కకు పెట్టి.. వారంలో ఒక్క రోజైనా వాహనాలు ఉపయోగించకుండా పనులు చక్కబెట్టుకోవాలి. ఏడాదిలో పది మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం లాంటివి చేయాల్సిందే.

నగరి–1180. చిత్తూరు–830, పలమనేరు–299.. ఇదేదో ఉత్తమ నగరాలకు ఇచ్చే ర్యాంకులు అనుకునేరు. ఈనెల 8వ తేదీన నమోదైన గరిష్ట ఏక్యూఐ పాయింట్లు. సాధారణంగా ఏక్యూఐ 0–50 పాయింట్ల మధ్యన ఉండాలి. కానీ, ఇక్కడ పేర్కొన్న పాయింట్లు చూస్తుంటే..మనం ఎలాంటి గాలి పీలుస్తున్నామో అర్థమవుతోంది. జిల్లాలో దీపావళి ముందు.. తర్వాత భారీ స్థాయిలో వాయు కాలుష్యం ఏర్పడింది. ఓవైపు వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, కర్మాగారాల నుంచి వచ్చే ధుమ్మూ.. ధూళి కణాలు.. మరోవైపు బాణసంచా కాల్చడంతో తలెత్తిన కాలుష్యం స్థాయి ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను హరించి.. జీవుల ప్రాణాలపైకి వస్తోంది.

నిద్ర వీడాల్సిందే..

ప్రమాదకరంగా పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement