కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈ నెల 24వ తేదీన కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే వినాయకస్వామివారి ఆలయంతోపాటు మరగదాంబికా సమేత శ్రీమణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో, జ్వాలా తోరణం కార్తీక దీపోత్సవ చేపట్టనున్నట్లు వివరించారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 16, 23, 24, 30, డిసెంబర్ 07 తేదీలలో వచ్చే సోమవారాల్లో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
‘పది’ పరీక్షల ఫీజు
షెడ్యూల్ విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ జారీచేశారని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు, రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారని వివరించారు. అన్ని సబ్జెక్టులు లేదా 3 కంటే ఎక్కువ ఉంటే రూ. 125, 3 సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషనల్ విద్యార్థులకు అదనంగా రూ. 60, వయోపరిమితి మినహాయింపునకు రూ.300 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నిర్ధేశించిన ఫీజుకంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానోపాధ్యాయులు అధికారిక వెబ్సైట్ www. bre.ap.gov.in లో మాత్రమే ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని సూచించారు. సీఎఫ్ఎంఎస్, బ్యాంక్ చలానాలతో ఫీజు కడితే తిరస్కరిస్తామని స్పష్టం చేశారు.
నేడు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ డ్రైవ్ ఓరియెంటేషన్
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం అడ్మిషన్ డ్రైవ్ ఓరియెంటేషన్ నిర్వహించనున్నట్లు జిల్లా కో–ఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రత్యేక అడ్మిషన్ డ్రైవ్‌పై అవగాహన కల్పించేందుకు ఓరియెంటేషన్ చేపట్టామన్నారు. ఉదయం 10 గంటలకు చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకరోజు ఓరియంటేషన్ ప్రారంభించనున్నట్లు వివరించారు. జిల్లాలోని సంబంధిత అధికారులు, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్లందరూ హాజరుకావాలని కోరారు.
విద్యార్థులకు అభినందన
వడమాలపేట (పుత్తూరు) : తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా సబ్ జూనియర్ జూడో చాంపియన్‌షిప్ పోటీల్లో వడమాలపేట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో పోటీపడిన 9వ తరగతి విద్యార్థులు హరిణి, చందన , అన్నపూర్ణ, హేమంత్‌కుమార్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు ఈనెల 14, 15 తేదీల్లో కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూడో పోటీలకు హాజరుకానున్నారు. సోమవారం ఈ మేరకు విజేతలైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయిని కరుణా నవనీతం, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,228 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,564మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది.


