పల్లె పోరుకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరుకు వేళాయె!

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

● మూడు విడతలుగా ఎన్నికలు

చిత్తూరు కార్పొరేషన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక పల్లె పోరు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాల మేరకు సోమవారం జెడ్పీ కార్యాలయంలో ఆర్‌ఓలకు ఎన్నికల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుధార్‌రావు పలు అంశాలను వివరించారు. మరో 4 రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల కానుంది. మూడు విడతలుగా ఈ నెల 26, 29, డిసెంబర్‌ 2వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్‌ రోజే ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 621 పంచాయతీల్లో రామకుప్పం మండలంలోని ననియాలతాండ, పులిచెర్ల మండలంలోని పొసంవారిపల్లె, ఎల్లంకివారిపల్లె , పెనుమూరు మండలంలోని కలిగిరి, మొరవకండిగ్ర పంచాయతీలకు కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగవు. మిగిలిన 617 పంచాయతీలు, 5,882 వార్డులకు ఎన్నికలు జరిపించనున్నారు. ఈ మేరకు 5,902 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో సమస్యాత్మకమైనవి 1,675, అత్యంత సమస్యాత్మకమైనవి 1,205గా గుర్తించారు. అన్ని రకాల బ్యాలెట్‌ బాక్స్‌లు 6,209 సిద్ధం చేశారు. తొలివిడతలో పలమనేరు, వి.కోట, బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి, కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు చేపట్టనున్నారు. తర్వాత రెండో విడత కింద చిత్తూరు మండలం, గుడిపాల, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, బంగారుపాళ్యం, యాదమరి, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లోని పంచాయతీలు, అనంతరం మూడో విడతగా కార్వేటినగరం, నగరి, నిండ్ర, పాలసముద్రం, విజయపురం, జీడీనెల్లూరు, పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నికలకు రూ.3.70 కోట్లు

జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు రూ3.0 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తొలి విడతగా రూ.1.65 కోట్లు విడుదల మంజూరు చేసింది. పలు పద్దుల్లో నిధుల విడుదల చేసేందుకు ఉన్నతాధికారులకు అనుమతిచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు చేసిన ఖర్చులకు బిల్లులు పంపితే వాటికి నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement