పొట్టను పిండేసి.. శిశువును చిదిమేసి! | - | Sakshi
Sakshi News home page

పొట్టను పిండేసి.. శిశువును చిదిమేసి!

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

అబార్షన్లకు అడ్డాగా చిత్తూరు యథేచ్ఛగా భ్రూణ హత్యలు అక్రమ స్కానింగ్‌లు.. కడుపుకోతలు పొరుగు రాష్ట్రాలకు సైతం విస్తరించిన నెట్‌వర్క్‌ నిద్రావస్థలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

మామూళ్ల మత్తులో అధికారులు?

జిల్లాలో అనుమతి లేని ఆస్పత్రులు, స్కానింగ్‌ మిషన్లు విచ్చలవిడిగా దందా సాగిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పర్యవేక్షించాల్సిన ప్రోగ్రామ్‌ అధికారులు, డెమో విభాగ అధికారులు కనిపించడమే లేదు. కొందరు అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో కూరుకుపోయి అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ అక్రమ స్కానింగ్‌లు, అబార్షన్ల సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో అబార్షన్ల ముఠాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. కడుపులో పెరుగుతున్న పాపాయి ప్రాణాలను తీసేస్తున్నాయి. కాసుల వేటలో కన్నుమిన్నూ కానక వ్యవహరిస్తున్నాయి. చిత్తూరు నగరమే అడ్డాగా పలమనేరు, కుప్పం, నగరి ప్రాంతాల్లో దందా సాగిస్తున్నాయి. అక్రమంగా స్కానింగ్‌ చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. పొట్టలో ఉంది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు క్షణాల్లో శిశువును చిదిమేస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిద్రావస్థలో ఉండడంతో యథేచ్ఛగా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నాయి.

కాణిపాకం : జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉండగా.. ప్రైవేటు హాస్పిటళ్లు 1,000కి పైగానే ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 300 ఆస్పత్రులకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటితో పాటు 1,500 వరకు ఉన్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లు కూడా అబార్షన్ల దందాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటువంటి క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

స్కానింగ్‌ యంత్రాలతో లింగ నిర్ధారణ

అనుమతి లేని పోర్టబుల్‌ స్కానింగ్‌ యంత్రాలను ఉపయోగిస్తూ గర్భస్థ పిండం ఆడో, మగో తేల్చేస్తున్నారు. సాంకేతికతను ప్రాణాలు తీసేందుకు ఉపయోగిస్తూ, అక్రమార్కులు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. స్కానింగ్‌ సెంటర్లకు నేరుగా వెళ్లకుండా రహస్య ప్రదేశాల్లో లేదా ఇళ్లలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఆడ బిడ్డ అని తేలిన వెంటనే కథ ముగించేస్తున్నారు.

ఎల్లలు దాటిన దందా

ఈ దందా కేవలం మన జిల్లాకే పరిమితం కాకపోవడం గమనార్హం. సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా గర్భిణులు పెద్ద సంఖ్యలో చిత్తూరుకు వస్తున్నారు. ముఖ్యంగా రెండో, మూడో కాన్పు గర్భిణులనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు దందా సాగిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి ముఠాలు పిలిస్తే చాలు సరిహద్దులు దాటి తమిళనాడులోని తిరుపత్తూరు, వేలూరు, కర్ణాటకలోని ప్రాంతాలకు నేరుగా వెళ్లి అక్కడ అబార్షన్లు చేసి వస్తున్నారు.

ఇక్కడ మాత్రం గుడ్డి కన్ను

ఇటీవల చిత్తూరుకు చెందిన ఇద్దరు మహిళలు తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వాణియంబడికి అబార్షన్‌ చేసేందుకు వెళ్లారు. అక్కడ గర్భిణి కుటుంబసభ్యులు సమయానికి హెల్త్‌ ఆఫీసర్‌, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ఇద్దరూ కటకటాల పాలయ్యారు. తమిళనాడు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే స్పందించి కేసులు నమోదు చేస్తుంటే.. మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం కనీసం కన్ను తెరవడం లేదు. అక్కడి యంత్రాంగం చూపిన చొరవలో పదో వంతు కూడా ఇక్కడి అధికారులు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మందుల షాపుల పాత్రపై ఆరా

చట్టప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అమ్మకూడని ఎంటీపీ అబార్షన్‌ కిట్లు ఈ అక్రమార్కులకు ఎలా లభిస్తున్నాయనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న హోల్‌సేల్‌ మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు, స్థానిక మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఎవరు? గుట్టు చప్పుడు కాకుండా ఈ కిట్లను ఎలా చేరవేస్తున్నారు? అనే అంశాలపై జిల్లా పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నా యి. లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాల పై, వారికి సహక రిస్తున్న అధికారులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement