జెడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్రెడ్డే టార్గెట్ ఒక్కరి కోసం రెండు నియోజకవర్గాల టీడీపీ నేతల మోహరింపు దొంగ ఓట్లు.. రిగ్గింగ్ కోసం ఐదు వేల మంది అరాచకాన్ని అడ్డుకునేందుకు చెవిరెడ్డి కుటుంబం వీరోచిత పోరాటం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి రూరల్ మండల జెడ్పీటీసీ ఎన్నికను టీడీపీ నేతలు సవాల్‌గా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా రెండు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలంతా మూకుమ్మడిగా రంగంలోకి దిగారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ బడా నేతలంతా తిరుపతి రూరల్ మండలంలోనే మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తమ అనుచరులతో స్వైరవిహారం చేస్తూ భయానక వాతావరణాన్ని కల్పించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి, కుమారుడు పులివర్తి వినీల్ పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించి దొంగ ఓట్లకు పాల్పడ్డారు. ఆ ముగ్గురితో పాటు తుడా చైర్మన్న్ డాలర్స్ దివాకర్‌రెడ్డి, తిరుపతి టీడీపీ ఇన్చార్జి, మేయర్ జేబీ శ్రీనివాస్, శాప్ చైర్మన్న్ అనిమిని రవినాయుడు, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్‌వర్మ, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్‌యాదవ్, పులిగోరు మురళి, అన్నా రామచంద్రయ్యయాదవ్, నరసింహయాదవ్తోపాటు తిరుపతిలో కొత్తగా ఎన్నికై న టీడీపీ కార్పొరేటర్లంతా కిరాయి రౌడీలతో పోలింగ్ కేంద్రాలను చుట్టుముట్టారు.
ఐదు వేల మంది తరలింపు
తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న సాయినగర్, లింగేశ్వరనగర్, అవిలాల, ఓటేరు, శ్రీనివాసపురం, పద్మావతీపురం, ఉమ్మడి శెట్టిపల్లి, వేదాంతపురం, తిరుచానూరులోని పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ఐదు వేల మంది కాలేజీ యువకులను తీసుకొచ్చారు. ఆ యువతకు కిరాయి రౌడీలను తోడుపెట్టి పోలింగ్ కేంద్రాల వద్ద అలజడి సృష్టించారు. నిజమైన ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులను దెబ్బతీశారు. పలు కేంద్రాల్లో దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రెండు నియోజకవర్గాల టీడీపీ నేతలంతా ఒకే మండలంలో మోహరించడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఒకవైపు టీడీపీ నేతలంతా ఏకమై పోలింగ్ కేంద్రాలను కిరాయి రౌడీలతో మోహరింప చేయడం, మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. గొడవలు సృష్టించడానికి పులివర్తి నాని, అతని కుటుంబం చేసిన కుట్రలు అన్నింటినీ చూసిన చెవిరెడ్డి కుటుంబం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి క్షేత్రస్థాయిలో వీరోచిత పోరాటం చేసి అక్కడి పరిస్థితులను ఎదుర్కొన్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే మొదలైన టీడీపీ నేతల అరాచకపర్వం సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కొనసాగింది. దొంగ ఓట్లను తమ శక్తి మేరకు అడ్డుకున్నారు.


