సాక్షి, చిత్తూరు: మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యకాండ చూసిన ప్రజలు నివ్వెరపోయారు. కానీ ప్రాదేశిక పోరులో పచ్చ పార్టీ నేతల గూండాగిరి, రౌడీయిజం చూసిన జనం.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? అనే అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు. గురువారం జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ–ఎంపీటీసీ ఎన్నికల్లో పచ్చమూకలు హింసాకాండ మధ్య రక్తపాతం సృష్టించారు. టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. ఏజెంట్లను బూత్‌ల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ ఆధిపత్యం చూపించడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులు.. జిల్లాలో జరిగిన అన్యాయాలకు మౌనంతో సాక్ష్యంగా నిలిచారు.
గుడిపాలలో గూండాగిరి
జిల్లాలో ఎక్కడాలేని విధంగా చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాలలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు సొంత మండలం కావడంతో అక్రమ మార్గాల్లో ఓట్లు రిగ్గింగ్ చేసుకోవడానికి తొలినుంచి గుడిపాలపై దృష్టిపెట్టారు. చిత్తూరు నగరం నుంచి వేలాది మందిని బస్సులు, సుమోల్లో దొంగ ఓట్లు వేయడానికి గుడిపాలకు తీసుకొచ్చారు. కొత్తపల్లెలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి భర్త ఈశ్వర్ నాయుడు తన బౌన్సర్లతో వచ్చి కూర్చుని రిగ్గింగ్‌కు పాల్పడ్డాడు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చావబాదారు. బొమ్మసముద్రంలో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి సాయిప్రతాప్‌పై ఎమ్మెల్యే అనుచరులు చిత్తూరు వన్ టౌన్ సీఐ చిన్నపెద్దయ్య ఎదుటే దాడిచేశారు. కట్టకిందపల్లె గ్రామంలో మాజీ పంచాయతీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు సుధాకర్‌చౌదరి సతీమణిపై టీడీపీ నేతలు పిడిగుద్దులు గుద్దారు. చిత్తపార, వెంగమాంబపురం, పాపసముద్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై ఎస్‌ఐ రామ్మోహన్ దౌర్జన్యంగా వ్యవహరించారు.
పెనుమూరులో..
గంగాధనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో గొడుగుమానేపల్లెలో ఓటు వేసి బయటకు వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త యుగంధర్‌పై పులికల్లు టీడీపీ నేత ప్రసాద్ దాడికి పాల్పడి, రక్తం వచ్చేలా కొట్టాడు.
– పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెలో నాగిరెడ్డిపల్లెలో భారీ ఎత్తున టీడీపీ మూకలు దొంగ ఓట్లను వేయడానికి వచ్చారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో, పోలీసులు చెదరగొట్టారు. వి.కోట మండలం మర్రిమాకులపల్లె, గంగవరం మండలం మేలుమాయి పల్లెలోనూ టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. గ్రామాల్లోని ప్రజలే టీడీపీ గూండాలపై తిరగబడ్డారు.
– నగరి నియోజకవర్గం విజయపురం మండలం పోతులరాజు కండ్రిగలో టీడీపీ నేతలు బూత్‌ను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ, బీజేపీ నేతలను బయటకు పంపించేశారు.
పాత్రికేయులపై దాడులు
తవణంపల్లె మండలంలోని పట్నం పంచాయతీలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే సాక్షి రిపోర్టర్ జగన్నాధం వాటిని తన మొబైల్‌లో ఫోటోలు తీశారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ మూకలు జగన్నాధంపై పిడిగుద్దులు కురిపించారు. ఆయన్ను గోడకు వేసి కొట్టారు. ఆపై చేతిలో ఉన్న మొబైల్‌ను లాక్కును ధ్వసం చేశారు.
పాలసముద్రం మండలం బలిజకండ్రిగలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ అనుచరులు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేస్తుండగా సాక్షి రిపోర్టర్ శేఖర్ తన మొబైల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఆగ్రహించిన టీడీపీ గూండాలు శేఖర్‌పై దాడిచేసి, మొబైల్‌ను ధ్వంసం చేశారు.
సీఎం నివాసం ఉంన్న కడపల్లె సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించేసిన పోలీసులు, టీడీపీ నేతల చేత దగ్గరుండి రిగ్గింగ్ చేయించారు. ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు పలమనేరు–కుప్పం జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశాయి. కుప్పంలోని శాంతిపురం మండలం శివరామపురం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకుప్ప మండలం బందార్లపల్లి పంచాయతీ బూత్ నెంబర్ 14, 15 కంచి దాసనపల్లి, లింగాపురం, వైఎస్సార్‌సీఈ తరఫున ఏజెంట్లుగా వెళ్లిన మహేష్, సోమశేఖర్ ఇద్దరినీ టీడీపీ గూండాలు అడ్డుకుని దౌర్జన్యం చేశారు.
ఎంకే పురం సెగ్మెంట్ కృష్ణాపురం, కర్లగట్ట, రాళ్లబూదుగూరు బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇక్కడ పోలింగ్ బూత్‌లను టీడీపీ నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారు.


