అధికారుల కనుసన్నల్లోనే పరిషత్ రిగ్గింగ్ పర్వం
ప్రజాస్వామ్యాన్ని అమానుషంగా ఖూనీ చేసిన పచ్చమూకలు
పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకుండా ముందస్తు స్కెచ్
మృతులు, శాశ్వత వలస ఓట్లే ఆసరాగా తారా స్థాయిలో దొంగ ఓట్లు
పోలింగ్ ప్రక్రియ రోజు జాడలేని జనరల్ అబ్జర్వర్ శివశంకర్
యంత్రాంగం నిష్పాక్షికతపై విమర్శలు గుప్పిస్తున్న ఓటర్లు
ఎన్నికల పారదర్శకతను నీటిమూటగా మారుస్తూ అధికార టీడీపీ నాయకుల అరాచకాలకు, అక్రమాలకు రెడ్ కార్పెట్ పరిచారు. ముందుస్తు ఒప్పందాలు, పథకం ప్రకారం పక్కా స్కెచ్ వేసి రిగ్గింగ్ జరిగే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి తనిఖీలు చేపట్టకుండా పోలీసులు పచ్చమూకలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
చిత్తూరు కలెక్టరేట్ : ‘మేమేం చూడలేదు.. మేమేం వినలేదు.. మాకేం సంబంధం లేదు! ఇదీ జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ పర్వంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసు వ్యవస్థ అవలంబించిన బరితెగింపు ధోరణి! ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుముకలా నిలబడాల్సిన జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు పచ్చ చొక్కాలకు దండం పెట్టి ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేశారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు కాగితాలకే పరిమితం!
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాల నిఘా పక్కాగా ఉండాలి. కానీ జిల్లాలో సుప్రీం కోర్టు ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను పెట్టకుండా ముందస్తు స్కెచ్ వేశారు.. కనీసం నిష్పాక్షికంగా వీడియో తీసే వీడియోగ్రాఫర్లను సైతం నియమించకుండా అలసత్వం వహించారు. ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలీసుల కనుసన్నల్లో పోలింగ్ ప్రక్రియను రిగ్గింగ్ మయంగా మార్చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,138 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 40 శాతానికి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకుండా చేయడం వెనుక ఉన్న ముందస్తు కుట్ర కోణం పోలింగ్ రోజున అభ్యర్థుల ఆరోపణలతో బహిర్గతమైంది.
తారా స్థాయిలో దొంగ ఓట్లు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఎలాగైనా కై వసం చేసుకోవాలన్న దురాశతో టీడీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఓటర్ల జాబితాలో సవరణలు జరగకముందున్న పాత జాబితాను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్ ప్రక్రియలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు 55,773 మంది, మృతి చెందిన ఓటర్లు 42,337 మంది ఉన్నట్లు లెక్క తేలింది.ప్రస్తుతం జరిగిన పోలింగ్ లో సర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాను ప్రచురించారు. దీంతో మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల స్థానంలో దొంగ ఓటర్లను దింపి తారా స్థాయిలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మండలాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వెళ్లిన అర్బన్ ఓటర్లను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు రక్షణగా నిలవాల్సింది పోయి దొంగ ఓటర్లకు మద్ధతుగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దౌర్జన్యం చేశారు.
పట్టణ ప్రాంతాల నుంచి కుప్పలు, తెప్పలుగా..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలు ముగియడంతో వేల సంఖ్యలో దొంగ ఓటర్లను గ్రామాలకు తరలించారు. ఇందుకు టీడీపీ ముఖ్య నాయకులు అధ్యక్షత వహించారు. పట్టణ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ప్రైవేట్ బస్సుల్లో వేల సంఖ్యలో దొంగ ఓటర్లను గ్రామీణ మండలాలకు తరలించారు. ప్రాణాలతో లేనివారి పేరుతోనూ, ఊరు విడిచి వెళ్లినవారి పేరుతోనూ గుంపులు గుంపులుగా చొరబడి దొంగ ఓట్లు వేశారు. దొంగ ఓటర్లు వెళ్లినప్పుడు అడ్డు చెప్పకుండా ఉండేందుకు ప్రత్యర్థి పార్టీల ఏజెంట్‌లను భయాందోళనలు సృష్టించి తరిమివేశారు. ఓటరు గుర్తింపు కార్డులను సైతం సరిగా తనిఖీ చేయకుండా పీవోల కళ్లెదుటే దొంగ ఓటర్లకు ‘రెడ్ కార్పెట్’ పరిచి ఓట్లేయించడం శోచనీయం.
పారదర్శకత కరువు.
జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 9,46,426 మంది ఓటర్లు ఉన్న ఈ పరిషత్ పరిధిలో అధికారులు ప్రతీ రెండు గంటలకొకసారి పోలింగ్ శాతాన్ని ప్రకటించినప్పటికీ, ఆ గణాంకాల్లో పారదర్శకత కరువైందని ఓటర్లు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఓట్ల ఆధారంగా నమోదు చేసిన పోలింగ్ శాతంతో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా పరిషత్ ఎన్నికల పోలింగ్‌లో 9,46,426 మంది ఓటర్లకు గాను 7,22,159 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.3 శాతం పోలింగ్ నమోదైంది.
సమయం నమోదైన నమోదైన
ఓట్లు ఓటింగ్
శాతం
ఉదయం 9 గంటలకు 1,33,503 14.11
ఉదయం 11 గంటలకు 3,12,038 32.97
మధ్యాహ్నం 1 గంటకు 4,75,976 50.29
మధ్యాహ్నం 3 గంటలకు 6,07,437 64.18
సాయంత్రం 5 గంటలకు 7,22,159 76.3


