రేపే పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపే పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

● రెబల్‌ అభ్యర్థి అనుచరుడిపై దాడి ● తల పగులగొట్టిన టీడీపీ గూండాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 7 వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్‌) ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు), సీతమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో (గంగాధరనెల్లూరు నియోజకవర్గం), ఎస్వీ సెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో (పూతలపట్టు), ప్రభుత్వ ఒకేషనల్‌ కళాశాల కుప్పంలో (కుప్పం నియోజకవర్గం), ఎస్‌వీసీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పలమనేరులో (పలమనేరు నియోజకవర్గం) ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గుర్తించిన ఆయా కేంద్రాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపునకు 1,437 మంది సిబ్బందిని నియమిస్తున్నారు.

మహిళల ఓట్లే అధికం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5 వ తేదీన నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మహిళల ఓట్లే అధికంగా నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి జిల్లా పరిషత్‌ అధికారులు పోలింగ్‌ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 9,46,426 మందికి గాను 7,22,159 మంది ఓట్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా 76.30 శాతం పోలింగ్‌ నమోదైనట్లు చెప్పారు. మహిళలు 4,78,320 మందికి గాను 3,64,570 మంది, పురుషులు 4,68,082 మందికి గాను 3,57,583 మంది, ఇతరులు 24 మందికి గాను 6 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బైరెడ్డిపల్లి మండలంలో 82.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా, తర్వాత స్థానాల్లో గుడుపల్లి (80.75), శాంతిపురం (80.50 శాతం), పలమనేరు (80.47 శాతం), పెనుమూరు (80.12 శాతం), గంగవరం (79.62) శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా పూతలపట్టు (67), రామకుప్పం (69.27) శాతం ఓటింగ్‌ నమోదైందన్నారు. కాగా ఈ ఎన్నికల్లో అధికంగా రిగ్గింగ్‌ అయిన విషయం విదితమే. ఎన్నికల అధికారులు వెల్లడించిన నివేదికల ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 2,24,267 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు.

అస్వస్థతకు గురైన ఏపీవో

బంగారుపాళెం: మండలంలోని జంబువారిపల్లె ఎంపీటీసీ సెగ్మెంట్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన ఏపీవో అంబేడ్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా మార్కెట్‌ యార్డు ఆవరణలో ఉనన పోలింగ్‌ కేంద్రం 24 లో చిత్తూరు పీసీఆర్‌ కళాశాలలో పనిచేస్తున్న తమిళ అధ్యాపకుడు అంబేడ్కర్‌ ఏపీవోగా విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పొలింగ్‌ కేంద్రంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్‌వో లక్ష్మి డాక్టర్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

టీడీపీ నాయకుడిపైనే

పచ్చ మూకల దాడి

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలం దిగువమాసపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ నేత కుమార్‌పై గురువారం ఆ పార్టీకి చెందిన గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ దాడిలో కుమార్‌ తల తీవ్రంగా పగిలి రక్తం ఓడింది. రక్తగాయాలతో పడి ఉన్న బాధితుడిని స్థానిక గ్రామస్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ రెబల్‌ అభ్యర్థికి మద్దతుగా, ఆయన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడనే కక్షతోనే పచ్చ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ రక్తపాతానికి ఒడిగట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ నాయకుడిపైనే గూండాలు చేసిన అరాచకాన్ని చూసి దిగువమాసపల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. అన్యాయాన్ని నిలదీస్తూ గూండా ముఠాపై ఏకమై తిరగబడ్డారు. దాడికి వచ్చిన గూండాల కార్లను ధ్వంసం చేసి, వారిని గ్రామం నుంచి తరిమితరిమి కొట్టారు. గ్రామస్తుల తిరుగుబాటుతో భయపడిన పచ్చ మూకలు పరుగులు తీశాయి. ఈ ఘటనతో దిగువమాసపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement