టీడీపీ నేతల వల్ల పోలింగ్‌కు ఆటంకం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల వల్ల పోలింగ్‌కు ఆటంకం

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

● పోతురాజులు కండ్రిగలో పోలింగ్‌ అప్రజాస్వామికం ● మృతులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి ఓట్లు కూడా వేశారు ● ఎన్నికలు రద్దుచేసి రీపోలింగ్‌ నిర్వహించాలి ● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలకం ఈశ్వర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ ● అక్రమ అరెస్టులకు భయపడేది లేదు ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

విజయపురం (నగరి): విజయపురం మండలం పోతురాజులు కండ్రిగలో పోలింగ్‌ సజావుగా జరగలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలకం ఈశ్వర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. గురువారం మండలంలోని మంగళంలో మీడియాతో మాట్లాడుతూ.. విజయపురం మండలంలోని కేవీపురం, జగన్నాథపురం ఎంపీటీసీ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన జగన్నాథపురం బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి బుజ్జిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. పోలింగ్‌కు వచ్చిన ఓటర్ల నుంచి స్లిప్పులు తీసుకుని ఇతరులే ఓట్లు వేయడం సరికాదన్నారు. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు రావడంతో చెంగమనాయుడు కండ్రిగలో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారని, తిరిగి దానిని రద్దుచేసి పోతురాజులు కండ్రిగలోనే పోలింగ్‌ కేంద్రాన్ని కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్రమాలకు అడ్డుకట్ట పడలేదన్నారు. మృతిచెందిన వారి పేర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లను కూడా వేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమాలపై ప్రశ్నించిన తమను హౌస్‌ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోతురాజులు కండ్రిగలో పోలింగ్‌ అప్రజాస్వామికంగా జరిగిందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలను రద్దుచేసి, తిరిగి రీపోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం

కార్వేటినగరం: కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాకా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా గురువారం తమ స్వగ్రామం పాదిరికుప్పంలో నారాయణస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాళరాసి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని అన్నారు. నామినేషన్‌ సమయంలో ప్రతిపక్షాన్ని నామినేషన్లు వేయకుండా కిరాయి గూండాలను పురమాయించి భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఎన్నికల్లో కూడా అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి బ్యాచ్‌లను దింపి, స్థానికులపై గంజాయి కేసులు పెట్టాలని ప్రజాప్రతినిధి చెప్పడం దారుణమన్నారు. అదే విధంగా పెనుమూరు మండలంలో వైఎస్సార్‌సీపీకి బలమైన నాయకులైన బండికమలాకర్‌రెడ్డి, కంచర్ల చక్రవర్తి నాయుడు, జ్యోతినాఽథరెడ్డిని బలవంతంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారని, అలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్‌సీపీ విజయానికి జగనన్న సైన్యం ఈ కేసులకు వెనుకాడబోదని హెచ్చరించారు. అనంతరం మండలంలో జరుగుతున్న పోలింగ్‌ బూత్‌లను సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement