● ఇద్దరికి గాయాలు
బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లె చెక్‌పోస్టు కూడలిలో మంగళవారం ఓ బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. ఫూటుగా మద్యం తాగిన లారీ డ్రైవర్ మత్తులో ఇష్టం వచ్చినట్లు నడపడంతో ప్రమాదం జరిగింది. జంగాళఅగ్రహారం గ్రామానికి చెందిన ప్రదీప్, రాజేష్ బైక్‌పై వెళుతుండగా వెనుకనుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను బైరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులతో సైతం లారీ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. పట్టపగలే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంట్లో చోరీ
సాక్షి, చిత్తూరు: ఐరాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పనిచేస్తున్న బాబు ఇంట్లో చోరీ జరిగింది. చిత్తూరు నగరంలోని సాంబయ్యకండ్రిగకు చెందిన బాబు, ఐరాలలో పీడీగా పనిచేస్తున్నారు. హైదరాబాదులో ఉన్న తన కుమార్తెను చూడడానికి శనివారం వెళ్లిన ఆయన మంగళవారం ఇంటికి వచ్చారు. సాంబయ్యకండ్రిగలోని తన ఇంటి కిటికీ ఇనుప చువ్వలు కత్తిరించి, తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా రూ.75 వేల నగదు, రెండు సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ చిన్నపెద్దయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తేనెటీగల దాడిలో ఒకరి మృతి
నిండ్ర (నగరి) : నిండ్ర మండలంలోని అయ్యారు కండ్రిగలో తేనెటీగల దాడి చేయడంతో మునస్వామి యాదవ్ (62) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో మునస్వామి యాదవ్ తన మామిడి తోట వద్దకు వెళ్లగా చెట్టుకున్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.


