చిత్తూరు రూరల్ (కాణిపాకం): మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాయితీపై ఉల్లిపాయల పంపిణీ చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు చిత్తూరు నగరంలోని రైతు బజారులో శనివారం ఉద యం 8గంటలకు రాయితీ ఉల్లిపాయల పంపిణీని అధికారులు ప్రారంభిస్తారు. ఈ ప్రత్యేక విక్రయాల ద్వారా కేజీ రూ.35లకు ఒక్కో కుటుంబానికి రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలను అందించనున్నారు. లబ్ధిదారులు ఈ రాయితీ సదుపాయాన్ని పొందేందుకు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డును చూపించాల్సి ఉంటుంది.
హనుమయ్య కనుమరుగు !
నగరి: నగరి మున్సిపాలిటీ పరిధి, కీళపట్టు మలుపు వద్ద ఓ దొంగ భక్తునిగా మారి నిర్మించిన ఆంజనేయ ఆలయం జాతీయ రహదారి రూపంలో కనుమరుగైంది. ప్రధాన రహదారి మలుపు వద్ద గుర్తింపు చిహ్నంగా ఉన్న ఈ ఆలయానికి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నిర్మాణానికి సహకారం అందించడంతో పాటు నగరికి విచ్చేసి ఆలయాన్ని ఆయనే ప్రారంభించా రు. ఆలయంతో పాటు ఆలయం పక్కనే 25 అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహా న్ని కూడా ఏర్పాటుచేశారు. దీంతో ఈ ఆలయం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా రెండు నెలల క్రితం ఆలయాన్ని కూల్చేసినా 25 అడుగుల విగ్రహం మాత్రం అక్కడే ఉంటూ అందరికీ దర్శనమిస్తూ వచ్చింది. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఆ విగ్రహాన్ని కూడా తీసేయడంతో ఆలయం పూర్తిగా కనుమరుగైంది.
నిర్వహణ లోపం
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహణ లోపం సృష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో అధికారక పెద్ద స్థాయి కార్యక్రమాలను జెడ్పీ కార్యాలయంలో నిర్వహించడం పరిపాటి. కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నీటి సమస్యలున్నాయి. సమావేశ మందిరంలో సీలింగ్ దెబ్బతినడంతో అందులోని ఏసీ నీరు కారుతోంది. దీంతో సీట్లు తడిచిపోయి వ్యర్థపు నీరు నేలపై చేరింది. దీంతో సిబ్బంది నీరు కారేచోట బకెట్లు పెట్టారు.
తపాలా సిబ్బందికి పురస్కారాలు
చిత్తూరు కార్పొరేషన్: తపాలా ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆశాఖ చిత్తూరు డివిజన్ సూపరింటెండెంట్ కిరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో బీమా సంకల్ప్ అభియాన్ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా గ్రామీణ బీమా, జీవిత బీమా, పోస్టుపేమేంట్, బ్యాంక్ సేవల్లో ప్రతిభ చూపిన ఐదుగురు సిబ్బంది పురస్కారాలు అందజేశారు. ఇంకో 53 మంది సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో తపాలా అధికారులు పాల్గొన్నారు.


