కార్వేటినగరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించి నట్టేట ముంచడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం పుత్తూరులోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాల పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదల అభివృద్ధి కోసం తపించి చరిత్ర సృష్టించార్నారు. అదే కోవకు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలను అందించారన్నారు. పెరియార్, ఇందిరాగాంధీ, అంబేడ్కర్, పూలే, రాజశేఖర్‌రెడ్డి వంటి మేధావుల చరిత్ర తెలుసుకున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వారికి అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చాలన్న సంకల్పంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమ ఫలాలు చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబు 34 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకుందనే రాసే పచ్చ పత్రికను మేధావులు కూడా చదవాలని తెలిపారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ఏ జిల్లాకు వెళ్లాలన్నా ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌లోను, విమానంలోనూ ఆ జిల్లాలకు చెందిన మంత్రులను కచ్చితంగా వెంట తీసుకెళ్లే వారని తెలిపారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో నవరత్నాల పేరుతో రూ. 2లక్షల 70 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమచేసి పేద కళ్లల్లో వెలుగులు నింపిన చరిత్ర జగనన్నదే అని ప్రశంసించారు. విద్య పేదల తరలరాతలు మారుస్తుందని ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు పేరుతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునీకరించారని తెలిపారు.
చంద్రబాబుకు బుద్ధి చెబుదాం
మాయ మాటలు, నోటికొచ్చిన హామీలతో గద్దెనెక్కిన కపట చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.


