చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ వెంకటనారాయణ కేసు వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.9 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఎం.మురుగన్ అలియాస్ రాము (52), కె.బాబు (43) గ్రామీణ ప్రాంతాలు, నిర్మానుష్య రహదారుల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడేవారన్నారు. జూలై 11వ తేదీన పెనుమూరు మండలం మొరవకండ్రిగ, జూలై 30న చిన్నరాజుపల్లె, మే 12న జీడీ నెల్లూరు మండలం బొమ్మవారిపల్లె సమీపంలో మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారని వెల్లడించారు. ఈ క్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు.. సీఐలు రామచంద్ర, సయ్యద్ హషం, ఎస్‌ఐలు పి.శ్రీకాంత్, మణికంఠేశ్వర రెడ్డి, వెంకట సుబ్బయ్య, ఏఎస్‌ఐ దేవరాజులు రెడ్డి, క్రైమ్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తించారన్నారు. విశ్వసనీయ సమాచారంతో పెనుమూరు మండల కొత్త రోడ్డు సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఏ–1 నిందితుడు మురుగన్‌్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 16 ఆస్తి సంబంధిత కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేసులను వేగంగా ఛేదించి, రికవరీ సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ వెల్లడించారు.


